నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. 59 సంవత్సరాలుగా ఎన్ఎంఎంఎల్ ప్రపంచ మేధోపరమైన ల్యాండ్‌మార్క్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు. అదొక పుస్తకాల భాండాగారంగా, ఆర్కైవ్‌ల నిధిగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభద్రతాభావంతో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును మార్చినట్లు ఆయన మండిపడ్డారు. ఈ మేరకు జయరాం రమేష్ ట్వీట్ చేశారు. ఆయన చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు అందరి ప్రధానుల చరిత్రను ఈ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో రికార్డు చేయనున్నారు.
1964లో నవంబర్ 14న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ప్రారంభం
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సమావేశం తర్వాత దాని పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండే లైబ్రరీ సొసైటీగా మార్చాలని నిర్ణయించారు. నెహ్రూ 75వ జయంతిని పురస్కరించుకొని 1964లో నవంబర్ 14న ఎన్‌ఎంఎంఎల్ ప్రారంభించారు. అప్పట్లో నెహ్రూ అధికార నివాస సముదాయమైన తీన్ మూర్తి కాంప్లెక్స్‌లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. తీన్ మూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానులందరికీ అంకితం చేస్తూ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచనను 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్162వ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు.