JNU: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌పై పోలీసుల కేసు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే ప్రొఫెసర్ విధుల నుంచి తొలగించారు. తాజాగా వర్సిటీ చీఫ్ సెక్యూరిటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు దిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో బిమోల్ అకోయిజమ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. విద్యార్థినులను లైంగికంగా వేధించడం, వారి అనుమతి లేకుండా తాకడం,అసభ్యకరమైన చిత్రాలను చూపించడం,లైంగిక కోర్కెలు తీర్చాలని కోరడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
వివరాలు
11 మంది విద్యార్థినుల ఆరోపణలు
బిమోల్ అకోయిజమ్ మణిపుర్‌లోని ఇన్నర్ మణిపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు.
జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ విభాగంలో పనిచేసిన బిమోల్ అకోయిజమ్‌పై విశ్వవిద్యాలయానికి చెందిన 11మంది విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదులపై వర్సిటీ అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది.దర్యాప్తు అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
వైవా పరీక్షలు,ఇతర తరగతుల సమయంలోనే కాకుండా క్యాంపస్‌లోని తన నివాసంలోనూ ఆయన అసభ్యకరంగా ప్రవర్తించేవారని విద్యార్థినులు ఆరోపించినట్లు కథనంలో పేర్కొన్నారు.
తమ లైంగిక కోర్కెలు తీరిస్తే పరీక్షల్లో అధిక మార్కులు వేస్తానంటూ ప్రలోభపెట్టేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విశ్వవిద్యాలయం ఆయనను ప్రొఫెసర్ విధుల నుంచి తొలగించింది.
వివరాలు
ఆరోపణలను ఖండించిన ఎంపీ
తనపై వచ్చిన ఆరోపణలను బిమోల్ అకోయిజమ్ ఖండించారు. విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.