గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలుడు తమ క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో అతని మేనమామ చేతి వేలిని నరికిన అమానవీయమైన ఘటన పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఓ స్కూల్ ప్లే గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న బాలుడు, బంతిని ఎత్తుకెళ్లాడనే నెపంతో అతడ్ని నిందితులు తీవ్రంగా బెదిరిస్తూ కుల దూషణలకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాలుడి మేనమామ, కుల అవమానాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. అయినప్పటికీ సాయంత్రం నిందితులంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి సదరు దళిత బాలుడి ఇంటిపైకి మారణాయుధాలతో వెళ్లారని పోలీసులు గుర్తించారు.
బాలుడి ఇంటి మీదకి మారణాయుధాలతో వచ్చిన ఏడుగురు నిందితులు
ఈ క్రమంలోనే బాలుడి నివాసం వద్ద తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో మామ ధీరజ్ పర్మార్, అతని సోదరుడు కీర్తిలపై నిందితులు మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన నిందితుల బృందం పదునైన ఆయుధాలతో బాలుడి చిన్నమామ కీర్తి బొటన వేలును అత్యంత పాశవికంగా నరికారని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం నిందితులపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు. సెక్షన్ 326 (పదునైన ఆయుధాలతో గాయపరచడం ), 506 (నేరపూరిత బెదిరింపు), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సహా ఎస్సీ,ఎస్టీ (అట్రాసిటీల నిరోధక చట్టం) ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వెల్లడించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు నిరంతరం గాలిస్తున్నాయని, త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.