Loading...
Karnataka: కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు
కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

Karnataka: కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ 2022లో అప్పటి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వేషన్లను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. దీంతో ఓబీసీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం నుంచి 56 శాతానికి చేరాయి.

వివరాలు 

రాజ్యాంగంలోని 14, 15వ అధికరణాలకు విరుద్ధం: హైకోర్టు

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ కేఎస్ హేమలేఖతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.

రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడం రాజ్యాంగంలోని 14, 15వ అధికరణాలకు విరుద్ధమని పేర్కొంది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటేలా చేసిన చట్టంలోని మూడో సెక్షన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

వివరాలు 

జనాభా కూర్పు వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం

రాష్ట్ర జనాభా కూర్పును బట్టి రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తిరస్కరించింది.

రాష్ట్ర జనాభాలో 90 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ వాదనను అంగీకరిస్తే రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాలు దెబ్బతింటాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం రిజర్వేషన్లకు కారణం కావచ్చని, కానీ అందుకోసం మొత్తం రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై రాజ్యాంగ నిబంధనలను పరిశీలించిన కోర్టు

వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేదని నిరూపించే ఆధారాలు రిజర్వేషన్లకు మద్దతుగా నిలవవచ్చని కోర్టు పేర్కొంది.

అయితే, ఆ కారణంతోనే మొత్తం రిజర్వేషన్ల పరిమితిని ఆటోమేటిక్‌గా పెంచలేమని తెలిపింది.

వెనుకబాటుతనం, తగిన ప్రాతినిధ్యం లేకపోవడానికి సంబంధించి లెక్కలతో కూడిన సమాచారాన్ని సేకరించినంత మాత్రాన 50 శాతం పరిమితిని దాటేందుకు అనుమతి లభించదని స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత కమిషన్లను సంప్రదించాలన్న రాజ్యాంగపరమైన బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వం పాటించిందా లేదా అన్న అంశాన్ని కూడా ధర్మాసనం పరిశీలించింది.

ADVERTISEMENT

వివరాలు 

రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సిద్ధరామయ్య

హైకోర్టు తీర్పుపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నప్పటికీ, పెంపును ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.

రాజ్యాంగపరంగా ఆ నిర్ణయం నిలబడుతుందో లేదో ముందుగా నిర్ధారించుకోకుండా రిజర్వేషన్లను ఎలా పెంచారని నిలదీశారు.

శాశ్వత సామాజిక న్యాయం కంటే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రాధాన్యం ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ADVERTISEMENT