కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన వారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ BF.7 బారిన పడ్డవారికి ఉచితంగా చికిత్స చేయననున్నట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి, మంగళూరులోని వెన్‌లాక్ ఆస్పత్రులను ప్రత్యేకంగా BF.7 సోకిన రోగులకు చికిత్స చెయ్యడానికి కేటాయించినట్లు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను విధిస్తూ.. మార్గదర్శకాలను జారీ చేసిన కొద్దిసేపటికే.. మంత్రి అశోక ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బార్‌లు, పబ్‌లు, రెస్టారెంట్‌లతో సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేశారు. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 1 గంటల వరకు మాత్రమే వేడుకలు చేసుకోవడానికి అనుమతించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో కూడా మాస్క్‌లను తప్పసరి చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్‌ను కర్ణాటక ప్రభుత్వం నిర్వహించింది. దేశంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శాలను జారీ చేసిన విషయం తెలిసిందే.