Kazipet Rail Manufacturing Unit :తుది దశకు కాజీపేట రైల్వే యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వరంగల్ పరిధిలోని కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బహుళ ప్రయోజన రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాన్ని త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి, అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం వెల్లడించారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఈ కేంద్రాన్ని దేశ రైల్వే రంగంలో కీలక తయారీ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతం
తొలి దశలో భాగంగా వచ్చే ఐదేళ్లలో ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ లక్ష్యాన్ని కాజీపేట యూనిట్‌కు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇక్కడ తయారయ్యే ఈ సరికొత్త రైళ్లు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయని పేర్కొన్నారు. ఈ రైళ్లు 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో రూపొందించబడనున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్, మెరుగైన వెంటిలేషన్ వ్యవస్థ, సురక్షిత కోచ్ డిజైన్, అలాగే ప్రయాణ సమయంలో కుదుపులు తగ్గించే ఆధునిక జెర్క్-ఫ్రీ కప్లర్స్‌ను అమర్చనున్నట్లు మంత్రి వివరించారు.
వివరాలు
గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్లు
దేశవ్యాప్తంగా తక్కువ దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఈ ఇంటర్‌సిటీ రైళ్లను వినియోగించనున్నారు. పట్టణాలు, నగరాలను అనుసంధానిస్తూ షటిల్ సర్వీసుల తరహాలో ఇవి నడవనున్నాయి. సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మార్గాల్లో గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ట్రిప్‌లోనూ ఎక్కువ సంఖ్యలో స్టాపింగ్‌లు కల్పించనున్నారు. ఈ రైళ్ల అందుబాటులోకి రావడంతో స్థానిక రోడ్డు రవాణా రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజలు రైల్వే రవాణాపై మరింతగా ఆధారపడే అవకాశముందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వివరాలు
'రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ' కూడా అమలు
సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఈ ఇంటర్‌సిటీ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. సమీప పట్టణాలు, నగరాలకు ఉన్నత విద్య కోసం ప్రతిరోజూ వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ప్రయాణించే సాధారణ ప్రజలు, అలాగే వైద్య అవసరాల కోసం నగరాలకు వెళ్లే రోగులకు ఇవి తక్కువ ఖర్చుతో కూడిన ఉత్తమ ప్రయాణ ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ ఆధునిక రైళ్లలో పర్యావరణ హిత సాంకేతికత అయిన 'రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ'ను కూడా అమలు చేయనున్నారు. రైళ్లకు బ్రేకులు వేసిన ప్రతిసారి స్వయంచాలకంగా విద్యుత్ ఉత్పత్తి అవుతూ, ఆ విద్యుత్‌ను తిరిగి పవర్ గ్రిడ్‌కు సరఫరా చేసే విధంగా ఈ సాంకేతికత పనిచేస్తుంది.
వివరాలు
గణనీయంగా తగ్గనున్న కార్బన్ ఉద్గారాలు
దీని వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు రోడ్డు రవాణాతో పోలిస్తే కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గనున్నాయి. కాజీపేట రైల్వే యూనిట్ పనులు తుది దశకు చేరుకోవడం, ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ ఆర్డర్లు దక్కడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ కార్యకలాపాలు ప్రారంభమైతే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.