Kerala: స్నేహితుల ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్ తొప్పిపై కేరళ పోలీసుల ఛార్జ్‌షీట్
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుల వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నిహాద్ అలియాస్ తొప్పిపై కేరళ సైబర్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలువా రూరల్ సైబర్ పోలీసులు ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో ఈ ఛార్జ్‌షీట్‌ను సమర్పించారు. ఈ కేసులో నిహాద్‌పై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్నేహితులతో వ్యక్తిగత వివాదాలు తలెత్తడంతో నిహాద్ వారి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు.
వివరాలు
ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన నిహాద్
విచారణలో భాగంగా వీడియోలు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్‌ను తొలగించాలని పోలీసులు యూట్యూబ్ సంస్థకు లేఖ రాశారు. దీంతో సదరు ఛానల్‌ను యూట్యూబ్ తొలగించింది.
ఈ కేసు విచారణకు హాజరుకావాలని గతంలో పోలీసులు నిహాద్‌కు నోటీసులు జారీ చేశారు.
అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేనని నిహాద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
ఆ తర్వాత నిహాద్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు తదుపరి విచారణకు సిద్ధమైంది.