Anagani Satyaprasad: భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..
ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి ఆధారంగా సగటున 15% నుంచి 20% వరకు విలువలను పెంచుతున్నామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను కొనసాగించాల్సిందిగా ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు. గత వైసీపీ పాలనలో కొన్నిచోట్ల అడ్డగోలుగా పెంచిన విలువలను తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించిన విలువలపై జిల్లా కమిటీలు సమీక్షించిన తరువాత,అధికారులను మరోసారి పరిశీలనకు ఆదేశించామని,జనవరి 15 నాటికి తుది ప్రతిపాదనలపై ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాడేపల్లిలో రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పెరిగిన భూ లావాదేవీలు
గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదని, నరసరావుపేటలో రూ.కోటి విలువైన భూమిని రూ.20 లక్షలకు తగ్గించినట్లు ఉదాహరణగా తెలిపారు. గతంలో అసంబద్ధంగా మారిన విలువలను శాస్త్రీయ విధానంతో సవరిస్తున్నామని, కొత్త విలువలపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,546.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు,ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6,156 కోట్ల ఆదాయం నమోదైందని మంత్రి తెలిపారు. గతేడాది డిసెంబరుతో పోలిస్తే ఈ డిసెంబర్‌లో ఆదాయం 26.54% పెరిగినట్లు వివరించారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు,వరదల కారణంగా ఆదాయం తగ్గిన విషయాన్ని గుర్తుచేశారు.
నిషిద్ధ జాబితా నుంచి 4 లక్షల ఎకరాల తొలగింపు
వైసీపీ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారులలో సుమారు 7 లక్షల మంది పట్టాలు తీసుకోకపోవడం,వారిలో కొందరు అర్హులేమి కాకపోవడం, వైసీపీ నేతల బినామీలుగా ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని,ఈ స్థలాలపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిషిద్ధ జాబితా నుంచి 4 లక్షల ఎకరాలను అన్యాయంగా తొలగించి 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని, వీటిని తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా అనేక భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం.శేషగిరిబాబు పాల్గొన్నారు.