SIR: ఓటర్లకు కీలక హెచ్చరిక.. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు. ఇదే సమయంలో పత్రాల స్వీకరణతో పాటు వాటి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో 10 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అధికారికంగా కోరారు. ఇందుకు సంబంధించిన లేఖను ఈసీకి పంపించారు.
వివరాలు
దాదాపు 40 లక్షల పత్రాలు సేకరణకు అందని పరిస్థితి
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39,81,399 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించలేని (అన్ కలెక్టబుల్) జాబితాలో నమోదయ్యాయి.
వీటిలో 14,19,644 పత్రాలు మరణించిన ఓటర్లకు సంబంధించినవి. మరో 12,14,994 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కారణంగా వారి పత్రాలు అందుబాటులోకి రాలేదు.
అదనంగా 7,26,425 మంది ఓటర్ల ఇళ్లకు బీఎల్‌వోలు పలుమార్లు వెళ్లినా వారు అక్కడ లేకపోవడం, ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించకపోవడంతో పత్రాలు సేకరించడం సాధ్యపడలేదు.
మిగిలినవి డబుల్ ఎంట్రీలు, ఇతర సాంకేతిక కారణాలకు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు.
ఈ వివరాలన్నింటినీ ఎన్నికల సంఘం డిజిటల్ రికార్డుల్లో నమోదు చేసింది.
వివరాలు
98.32 శాతం పత్రాల డిజిటైజేషన్ పూర్తి
రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, వారిలో 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటైజ్ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇది మొత్తం ఓటర్లలో 98.32 శాతానికి సమానం. అన్ కలెక్టబుల్ పత్రాలను మినహాయిస్తే, 3,69,50,812 మంది ఓటర్ల పత్రాల డిజిటైజేషన్ పూర్తైందని అధికారులు తెలిపారు.
ఇది మొత్తం ఓటర్లలో 88.76 శాతంగా నమోదైంది.
వివరాలు
ఈ నియోజకవర్గాల్లో అన్ కలెక్టబుల్ పత్రాలు ఎక్కువ
అన్ కలెక్టబుల్ పత్రాల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుపతి (92,661), కడప (70,257), గుంటూరు పశ్చిమ (57,010), కర్నూలు (54,692), కాకినాడ సిటీ (53,214), చంద్రగిరి (52,633), నెల్లూరు గ్రామీణం (49,911), గుంటూరు తూర్పు (44,593), కాకినాడ గ్రామీణం (44,479), నరసరావుపేట (35,407) ఉన్నాయి. ఇక నర్సాపురం, భీమవరం, ఆచంట, ఉండి, దెందులూరు, రాజానగరం, మైలవరం, తిరువూరు, గన్నవరం, నందిగామ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో అన్ కలెక్టబుల్ పత్రాల సంఖ్య తక్కువగా నమోదైంది.
ఈ ప్రాంతాల్లో 5 వేల నుంచి 12 వేల మధ్య మాత్రమే అన్ కలెక్టబుల్ పత్రాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
గడువు పొడిగించాలని కేంద్ర ఈసీకి విజ్ఞప్తి
ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ,డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 10 రోజుల గడువు అవసరమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
రాజకీయ పార్టీలతో పాటు పలు జిల్లాల కలెక్టర్లు పంపిన వినతులను కూడా లేఖకు జత చేశారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో గడువు ముగియనుండగా, ఇంకా అనేక నియోజకవర్గాల్లో డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తికాలేదు.
నెల్లూరు గ్రామీణం, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం సిటీ, రాప్తాడు, గూడూరు, అనంతపురం అర్బన్, పాణ్యం,విజయవాడ సెంట్రల్,విజయవాడ తూర్పు,విశాఖపట్నం సౌత్,నందిగామ,మైలవరం,కోవూరు, విశాఖపట్నం నార్త్,కర్నూలు,నెల్లూరు సిటీ,చీరాల, జగ్గయ్యపేట, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం వరకు 5 నుంచి 10 శాతం డిజిటైజేషన్ పెండింగ్‌లో ఉంది.
వివరాలు
ఓటర్లు తప్పనిసరిగా చేయాల్సింది ఇదే
ఈ ప్రక్రియను ఒక్కరోజులో పూర్తి చేయడం కష్టమని భావించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రత్యేక అనుమతితో గడువు పొడిగించాలని కేంద్ర ఈసీని కోరారు.
అయితే సోమవారం సాయంత్రం వరకు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఎన్యూమరేషన్ పత్రాలను ఇంకా బీఎల్‌వోలకు సమర్పించని ఓటర్లు మంగళవారంలోపే తప్పనిసరిగా అందజేయాలి.
గడువులోగా పత్రాలు సమర్పించకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉంది.
దీంతో ఓటు హక్కు వినియోగంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
వివరాలు
ఓటర్లు తప్పనిసరిగా చేయాల్సింది ఇదే
ఇప్పటికే పత్రాలు సమర్పించిన వారు తమ వివరాలు డిజిటైజ్ అయ్యాయో లేదో ఎన్నికల సంఘం ఈసీఐ నెట్ యాప్ లేదా https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
ఫొటో ఓటరు గుర్తింపు కార్డు (EPIC) నంబర్ నమోదు చేస్తే పత్రం అప్‌లోడ్ అయిందా లేదా అనే సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది.