FDA: లేస్ నుంచి మ్యాగీ వరకు.. ఎఫ్‌డీఏ కొరడా, గడువు ముగిసిన రూ.75 లక్షల సరుకు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
షాపుల్లో కొనుగోలు చేసే లేస్, కుర్‌కురే, మ్యాగీ వంటి ప్యాకెట్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీలను చూసి వాటిని నమ్ముతుంటాం. అయితే ఆ తేదీలు నిజమైనవేనా? అనే సందేహాన్ని కలిగించే ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. నవీ ముంబైలో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులపై పాత తేదీలను చెరిపేసి.. కొత్త తేదీలతో స్టిక్కర్లు అంటించిన వ్యవహారం బయటపడింది. ఇలా మార్చిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో రూ.75 లక్షలకు పైగా విలువైన సరుకు పట్టుబడటం కలకలం రేపుతోంది.
వివరాలు
ఎఫ్‌డీఏ, క్రైమ్ బ్రాంచ్ సంయుక్త దాడులు
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), నవీ ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ కలిసి ఈ అక్రమ వ్యవహారంపై చర్యలు చేపట్టాయి.
ఆగస్టు 24 నుంచి 29 వరకు నవీ ముంబైలోని టర్బే పారిశ్రామిక ప్రాంతంలో సాధనా ఎంటర్‌ప్రైజెస్ ప్రాంగణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలను స్వాధీనం చేసుకున్నారు.
లేస్, కురుకురే, మ్యాగీ, నార్, రసోయ్, హెల్‌మాన్స్ వంటి ఆహార ఉత్పత్తులతో పాటు థమ్స్ అప్, లిమ్కా తదితర శీతల పానీయాలు కూడా ఈ సరుకులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పట్టుబడిన మొత్తం సరుకు విలువ రూ.75 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
అసలు తేదీలను చెరిపేసి.. కొత్త స్టిక్కర్లు
అధికారుల దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.
ప్యాకెట్లపై కంపెనీలు ముద్రించిన అసలు తయారీ తేదీ, గడువు తేదీలను తొలగించి.. వాటి స్థానంలో కొత్త తేదీలను ముద్రిస్తున్నట్లు గుర్తించారు.
ఇందుకోసం ఇంక్‌జెట్ ప్రింటర్లు, థిన్నర్లు, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్కర్లను ఉపయోగిస్తున్నట్లు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు.
అంతేకాదు.. ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్థాలు, పోషక విలువలు, ఇతర కీలక సమాచారంతో కూడిన అసలు లేబుళ్లను కూడా తొలగిస్తున్నట్లు తేలింది.
వాటి స్థానంలో కొత్త వివరాలతో స్టిక్కర్లు అంటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో వినియోగదారులకు ఉత్పత్తి అసలు తయారీ తేదీ, గడువు తేదీపై తప్పుడు సమాచారం అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
ఎగుమతి కంపెనీల ప్రమేయంపై దర్యాప్తు
ఈ వ్యవహారం కేవలం నవీ ముంబైకే పరిమితం కాలేదని అధికారులు అనుమానిస్తున్నారు.
ముంబైతో పాటు ఢిల్లీ, నోయిడాకు చెందిన కొన్ని ఎగుమతి-దిగుమతి సంస్థలకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో సమాచారం అందినట్లు తెలుస్తోంది.
గడువు ముగిసిన ఆహార పదార్థాలను తేదీలు మార్చి విదేశాలకు పంపుతున్న వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.