Chlorine Gas Leak: డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్‌లోని ఝంజ్రా ప్రాంతంలో మంగళవారం ఉదయం క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన ఘటన చోటుచేసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు ఆ ప్రాంతంలోని స్థానికులను ఖాళీ చేయించారు. డెహ్రాడూన్ ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఏళ్ళ తరబడి ఖాళీ ప్లాట్‌లో మంగళవారం ఉదయం డంప్ చేసిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. సమాచారం అందుకున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) అజయ్ సింగ్, స్థానిక పోలీసు బృందాలు, ఫైర్ టెండర్లు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఖాళీగా ఉన్న ఇంట్లో ఏడు క్లోరిన్ సిలిండర్లు
వారు ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రెస్క్యూ బృందాలు గ్యాస్ లీక్‌ను అరికట్టడానికి, సిలిండర్‌లను గొయ్యి తవ్వి పూడ్చివేశారు. ఈ సంఘటనపై సాహస్‌పూర్ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ స్పందిస్తూ.. 'ఖాళీగా ఉన్న ఇంట్లో ఏడు క్లోరిన్ సిలిండర్లు ఉన్నాయని,ఆ సిలిండర్ల నుంచే క్లోరిన్ లీక్ అయి ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎస్ బృందాలు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.