Nara Lokesh: రష్యా స్బేర్‌బ్యాంక్‌తో లోకేశ్ భేటీ.. ఏఐ, యూపీఐ భద్రతపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ),బ్యాంకింగ్,డిజిటల్ మౌలిక వసతులు,స్మార్ట్ సిటీల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. వెస్ట్రన్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, స్థానిక అవసరాలకు అనుగుణమైన జనరేటివ్ ఏఐ వ్యవస్థను రూపొందించిన స్బేర్‌బ్యాంక్ అనుభవాన్ని భారత్‌లో కూడా వినియోగించాలని లోకేశ్ సూచించారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ప్రజాపాలన, రిటైల్ రంగాల్లో స్బేర్‌బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను విస్తరించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
వివరాలు
భారత్‌లో స్కూల్ 21 అకాడమీలు, స్మార్ట్ సిటీ టెక్నాలజీ కోరిన లోకేశ్
దేశంలో యూపీఐ చెల్లింపు వ్యవస్థ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా స్బేర్‌బ్యాంక్ అభివృద్ధి చేసిన అధునాతన వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ టెక్నాలజీలను భారత బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించేందుకు సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా మున్సిపల్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్బేర్‌బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ భద్రతా వ్యవస్థలను విస్తరించాలని లోకేశ్ కోరారు. ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్, ఏఐ ఇంజినీర్లను తయారు చేయడానికి స్బేర్‌బ్యాంక్ నిర్వహిస్తున్న గేమిఫైడ్, పీర్-టు-పీర్ శిక్షణా విధానంతో కూడిన 'స్కూల్ 21' కోడింగ్ అకాడమీలను భారత్‌లోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
వివరాలు
రూపాయి-రూబుల్ వాణిజ్య లావాదేవీలకు అనుమతులు
అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణంలోని ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు మేలు జరిగేలా రూపాయి-రూబుల్ వాణిజ్య లావాదేవీలకు అనుమతులు కల్పించడంతో పాటు, వ్యవస్థీకృత రుణ సదుపాయాలు అందించాలని లోకేశ్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్పందించిన స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్, న్యూఢిల్లీ కార్యాలయం ద్వారా భారత్‌లో ద్వైపాక్షిక వాణిజ్య ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, భారత్-రష్యా వ్యాపార ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.