Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. చలి తీవ్రత పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక ప్రాంతాల దగ్గర ఏర్పడిన అల్పపీడన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి అనుసంధానంగా సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశ వైపు కదులుతోందని వాతావరణ వర్గాలు తెలిపాయి. ఈ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఇవాళ్టి నుంచి చలితీవ్రత పెరుగుతుందని అంచనా. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఉదయం 8 గంటల వరకు బయటకు రావడం ప్రజలకు కష్టంగా మారేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో వచ్చే రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి మరింతగా పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.