LPU: ఎల్‌పీయూలో విద్యార్థుల నిరసనలు తీవ్రం.. 10 రోజులు క్లాసులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో విద్యార్థుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరిస్థితుల నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు తరగతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో నిర్వహించాల్సిన మిడ్‌టర్మ్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. తదుపరి పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ సమయంలో తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని సూచించింది. విద్యార్థినిపై ఓ ప్లంబర్ అత్యాచారం చేశాడన్న వార్తలు వెలువడటంతో ఆదివారం ఎల్‌పీయూలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
వివరాలు
2వేలమంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన
గర్ల్స్ హాస్టల్-3 వద్ద శనివారం అర్ధరాత్రి నుంచే నిరసనలు ప్రారంభమైనట్లు సమాచారం.
విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న వార్తలు వైరల్ కావడంతో సుమారు 2వేలమంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు.
అత్యాచారం జరిగిన విషయంపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు.
ఈఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు 44వజాతీయ రహదారిని కూడా దిగ్బంధించారు.
దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఆందోళనల సమయంలో కొంత చోట మంటలు చెలరేగడంతో ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను కూడా ఏర్పాటు చేశారు.