Delhi Hotel Fire: ఢిల్లీ అగ్నిప్రమాదం తర్వాత కీలక నిర్ణయం.. బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ రద్దుకు ప్రభుత్వం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు భవనంలోని విద్యుత్ వైరింగ్‌లో ఉన్న లోపాలే షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ పేలిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని అధికారులు వెల్లడించారు. భవనాన్నిమంటలు చుట్టుముట్టిన తీరు పరిశీలిస్తే ఇది సిలిండర్ పేలుడు కారణంగా జరిగిన ప్రమాదంగా కనిపించడం లేదని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. హోటల్ బేస్‌మెంట్‌తో పాటు పై అంతస్తులో రెండు వంటశాలలు ఉన్నప్పటికీ,అక్కడ ఎలాంటి పేలుడు సంభవించినట్లు ఆధారాలు కనిపించలేదని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సమగ్ర దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పారు.
వివరాలు
బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీని ఉపసంహరించుకునే దిశగా చర్యలు
మరోవైపు, ఈ విషాద ఘటన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీని ఉపసంహరించుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద నడుస్తున్న అన్ని భవనాల్లో భద్రతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి కపిల్ మిశ్రా వెల్లడించారు. పాలసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వివరాలు
ఫ్లరిష్ స్టేకు 2024లో బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కింద లైసెన్స్
ఫ్లరిష్ స్టేకు 2024లో బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కింద లైసెన్స్ మంజూరైంది. ఆ అనుమతి 2027 వరకు చెల్లుబాటులో ఉంది. అయితే సిల్వర్ కేటగిరీ నిబంధనల ప్రకారం కేవలం ఆరు గదులను మాత్రమే అతిథుల వసతికి కేటాయించాల్సి ఉండగా, ఈ హోటల్‌లో 25 గదులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా భవనంలో అదనంగా నిర్మించిన కొన్ని అంతస్తులకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోలేదని కూడా దర్యాప్తులో బయటపడింది. దీంతో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.