Page Loader
Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక 
ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక

Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా విషయంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సహకారంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను జాబితాలో చేర్పిస్తున్నట్లు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే, ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని హెచ్చరించారు. నకిలీ ఓటర్ల చేర్పు-దీదీ ఆందోళన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియామకాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ ప్రభావంలో ఉందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను గుర్తు చేస్తూ, ఓటర్ల జాబితాను సరిచేయాలని, తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.

Details

హరియాణా, గుజరాత్‌ ఓటర్లు బెంగాల్‌లో?

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు హరియాణా, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే వ్యూహాన్ని బీజేపీ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ అమలు చేసిందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవలేదని అందుకే తప్పుడు జాబితా రూపొందిస్తున్నట్లు ఆరోపించారు.

Details

బీజేపీ వ్యూహంపై దీదీ ఘాటు వ్యాఖ్యలు 

బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తోందని, కానీ తృణమూల్ కాంగ్రెస్ అలా జరగనివ్వదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 215 స్థానాల్లో తృణమూల్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరవధిక దీక్షకు సిద్ధమని మమతా బెనర్జీ హెచ్చరించారు.