Medchal: పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు.. మేడ్చల్‌లో యూపీ యువకుడు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు మద్దతుగా పనిచేస్తున్న ముఠాతో సంబంధాలు కొనసాగించిన యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్ (22) ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి మేడ్చల్‌లోని ఓ భోజనశాలలో సర్వర్‌గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు రూపొందించి పోస్టులు పెడుతుండేవాడు. ముఖ్యంగా నకిలీ తుపాకులతో చేసిన వీడియోలకు ఎక్కువ స్పందన రావడంతో అలాంటి వీడియోలను మరింతగా తయారు చేశాడు. ఈ పోస్టులను గమనించిన పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సానుభూతిపరులు హబీబ్, రాణా హుస్సేన్‌లు అతడికి చేరువయ్యారు. వీరికి ఐఎస్‌ఐతో సంబంధాలున్న షహబాద్‌తో సన్నిహిత పరిచయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వివరాలు
రెండు నకిలీ తుపాకులు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం
షహబాద్ సూచనలతో హబీబ్, రాణా హుస్సేన్‌లు సామాజిక మాధ్యమాల ద్వారా జయీద్‌ఖాన్‌తో మాట్లాడటం ప్రారంభించారు. చాటింగ్ ద్వారా అతడిని ప్రేరేపిస్తూ, తమ మాట వింటే నిజమైన తుపాకులు పంపిస్తామని ఆశ చూపినట్టు విచారణలో బయటపడింది. జయీద్‌ఖాన్ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలు, అతడి అనుమానాస్పద కదలికలను నిఘా అధికారులు గమనించి మేడ్చల్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి గదిలో నుంచి రెండు నకిలీ తుపాకులు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్
ఫోన్‌ను పరిశీలించగా వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్‌షాట్‌లు, వాయిస్ సందేశాలు గుర్తించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారులు, ఉగ్రవాద అనుమానితులతో అతడు నిరంతరం మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అవకాశం వస్తే పాకిస్థాన్‌కు వస్తానని కూడా చాటింగ్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అతడు ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు, ఎలాంటి సమాచార మార్పిడి జరిగింది అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి న్యాయస్థానం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చర్లపల్లి జైలుకు తరలించారు.