Divya Mittal: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు,వారి ప్రశ్నలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలతో కలిసి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ను తన కర్మభూమిగా పేర్కొన్న ఆమె.. అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వీడియో సందేశంలో తెలిపారు. 2013 బ్యాచ్‌కు చెందిన దివ్యా మిట్టల్ ఆగస్టు 30, 2026న ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత,కుటుంబ కారణాలు,జీవితంలో కొత్త లక్ష్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వెల్లడించారు.
వివరాలు
మిర్జాపూర్ మహిళ చెప్పిన సమస్యతో కదిలిన దివ్యా మిట్టల్
కేంద్ర ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదించడంతో సెప్టెంబర్ 15 నుంచి అది అమల్లోకి వచ్చింది.
దీంతో రాజీనామా అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
రాజకీయాలు తనకు కేవలం పదవి కోసం వెళ్లే మార్గం కాదని దివ్యా మిట్టల్ చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల వరకు తమ సమస్యలను తీసుకెళ్లలేని ప్రజలకు, తీసుకెళ్లినా వారి సమస్యలు వినిపించని సందర్భాల్లో.. వారి తరఫున గొంతుకగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
రాజకీయ పార్టీలో చేరడం కంటే ప్రజలతో కలిసి పనిచేసే కొత్త రాజకీయ వేదికను నిర్మించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
మిర్జాపూర్‌లోని లహురియాదహ్ ప్రాంతంలో ఓ మహిళను కలిసిన సందర్భాన్ని దివ్యా మిట్టల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
వివరాలు
వనరుల కొరత కాదు.. సంకల్పం లేకపోవడమే సమస్య: దివ్యా మిట్టల్
ఐదో తరగతి తర్వాత పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామంలో తదుపరి తరగతులకు కూడా విద్య అందేలా పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆ మహిళ కోరినట్లు తెలిపారు.
పాఠశాలకు అనుమతి వచ్చినప్పటికీ.. మూడేళ్లు గడిచినా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని చెప్పారు.
సమస్య వనరుల కొరత కాదని.. సంకల్పం లేకపోవడమేనని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ హోదాలో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి పట్టాకు సంబంధించిన పత్రాలతో తనను కలిసిన విషయాన్ని కూడా దివ్యా మిట్టల్ ప్రస్తావించారు.
పట్టా మంజూరైనప్పటికీ ఆ భూమిపై వాస్తవ స్వాధీనం కల్పించలేదని తెలిపారు.
ఈ వ్యవహారంపై సంబంధిత నివేదికను పరిశీలించగా అవకతవకలు గుర్తించామని, అనంతరం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
వివరాలు
యువత సమస్యలపై ఫోకస్.. రాజకీయ వ్యవస్థలో మార్పే లక్ష్యం
యువత ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆమె మాట్లాడారు.
పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమయ్యే విద్యార్థులకు పేపర్ లీక్ ఘటనలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో అనేక ఉద్యోగాల స్వరూపం మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇద్దరు కుమార్తెల తల్లిగా భవిష్యత్ తరాలపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు.
ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మార్చడం తన లక్ష్యం కాదని దివ్యా మిట్టల్ అన్నారు.
రాజకీయ వ్యవస్థలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కులం, మతం, డబ్బు, బలప్రయోగం వంటి అంశాలకంటే ప్రజల భాగస్వామ్యంతో కొత్త రాజకీయ వేదికను నిర్మించాలన్న ఉద్దేశాన్ని ఆమె తన సందేశంలో వెల్లడించారు.
వివరాలు
ఐఐటీ, ఐఐఎం నుంచి ఐఏఎస్..
దివ్యా మిట్టల్ ఐఐటీ ఢిల్లీ,ఐఐఎం బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు.
అనంతరం లండన్‌లో ఉద్యోగం చేసిన ఆమె.. భారత్‌కు తిరిగి వచ్చి యూపీఎస్సీకి సిద్ధమై 2013లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో వివిధ పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు.మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మారుమూల గ్రామాలకు పైపుల ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో ఆమె గుర్తింపు పొందారు.
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్,దేవరియా,సంత్ కబీర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆమె జిల్లా కలెక్టర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2026 ఆగస్టులో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 15న రాజీనామా అధికారికంగా అమల్లోకి వచ్చింది. తాజాగా ఆమె స్వయంగా రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించడంతో తన తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు.
వివరాలు
రాజీనామాపై నేతల స్పందన..
ఆమె రాజీనామా అనంతరం కాంగ్రెస్ నేత అజయ్ రాయ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు స్పందించారు.
అయితే తన రాజీనామా వెనుక ఎలాంటి ఆకస్మిక కారణం లేదని, ఆలోచించి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని దివ్యా మిట్టల్ అప్పట్లో తెలిపారు.
ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ.. పార్టీ రాజకీయాలకు దూరంగా ప్రజలతో కలిసి కొత్త వేదికను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.