Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టే బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది.
ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ఈ కేసును విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది.
రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న ఈ పేలుడు జరగ్గా, 10 మంది గాయపడ్డారు. కేఫ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో పేలుడు సంభవించింది.
ఈ ఘటన జరిగిన తర్వాత దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ప్రమాదం జరిగిన తర్వాత సీసీటీవీ ఆధారంగా నిందితుడిని కూడా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు అతని జాడ తెలియలేదు.
దర్యాప్తు
ఇప్పటి వరకు నలుగురు అరెస్టు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి అప్పగించింది.
ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అంతకుముందు పోలీసు వర్గాలు తెలిపాయి.
వీరిని ధార్వాడ్, హుబ్బల్లి, బెంగళూరు నుంచి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
అలాగే, కేఫ్ యజమానికి వ్యాపార పరంగా పోటీగా ఉన్నవారిపై కూడా విచారణ జరుగుతోంది.
నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. లోతుగా విచారణ జరుపుతున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.