Nara Lokesh: మంత్రి లోకేశ్ స్ఫూర్తితో మగ్గిపోతున్న మగ్గానికి కొత్త ఊతం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'వీవర్‌శాల' కొరకు మంత్రి లోకేశ్ సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించారు. చేనేత రంగంలో మగ్గకు నూతన జీవాన్ని ఇచ్చేందుకు ఆయన నిర్ణయించారు. పెరుగుతున్న కష్టాలు, తక్కువ ఆదాయంతో కష్టపడుతున్న నేతన్నలకు అనుకూలంగా, కార్పొరేట్ స్థాయిలో విస్తారమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా అత్యాధునిక మగ్గాలు, సౌకర్యవంతమైన కుర్చీలతో పని చేసేందుకు వాతావరణం, భోజనశాల, మరుగుదొడ్లు, విశ్రాంతిగది, నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేక ఏర్పాట్లతో కూడిన 'వీవర్‌శాల'ను మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేశారు.
విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి లోకేష్ కృషి
చేనేతలో అనుభవజ్ఞులైన ఏడుగురు సభ్యుల బృందాన్ని చెన్నై, కోయంబత్తూరు పంపించి, టాటా గ్రూపు యొక్క 'తనైరా' చేనేత వీవర్స్‌శాలలు, ఇతర నేత విధానాలను, ఆదాయాన్ని పరిశీలించారు. ఈ నివేదిక ఆధారంగా లోకేశ్ తన సొంత ఖర్చుతో మంగళగిరి ఆటోనగర్‌లో 20 మగ్గాలతో విశాలమైన ప్రాంగణంలో ఈ 'వీవర్‌శాల'ను స్థాపించారు. ఇందులో అత్యాధునిక జాకార్డు మగ్గాలు ఏర్పాటు చేసి, నేత కార్మికులకు రెండు నెలల శిక్షణ అందిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లక్ష్యంగా, మంత్రి లోకేశ్ అడుగులు వేస్తున్నారు.