Page Loader
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌కు నాంది పలికింది. పౌరసేవలను మరింత సులభతరం చేయడానికి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో 161 రకాల పౌరసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్‌ వంటి విభాగాలకు సంబంధించిన 161 సేవలను "మన మిత్ర" ద్వారా ప్రజలకు అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రెండో దశలో 300కి పైగా పౌరసేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. ఈ నంబర్‌ను సేవ్ చేసుకుని, అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు.

వివరాలు 

"మన మిత్ర" పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు

వాట్సాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పరిపాలనా సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. "మన మిత్ర" పేరుతో దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు గవర్నెన్స్‌ను ముందుకు తీసుకువచ్చినట్లే, ఈసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నామని అన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు.

వివరాలు 

సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడకూడదనేదే..

"బటన్ నొక్కితే భోజనం, సినిమా టికెట్ అందుబాటులోకి వస్తాయి, అయితే పాలన ఎందుకు రాకూడదు?" అని ప్రశ్నించారు. ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఉండాలని తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను వివరించినప్పుడు, ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించామని తెలిపారు. గత ఐదేళ్లలో పలు సందర్భాల్లో సర్టిఫికెట్ల జారీ ఆలస్యం జరిగిందని, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ పోటీ చేయాలనుకున్న ఒక అభ్యర్థికి గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ అందించలేదని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇకపై ఎవరూ సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడకూడదనేదే తమ ఉద్దేశమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.