TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి నారాయణ శుభవార్త..!
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, త్వరలో లబ్ధిదారుల సమస్యలను పర్యవేక్షించి, పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం వివిధ రుణ రూపాల్లో 5546.48 కోట్లు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆపై, టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులను ఇచ్చినా, అవి 2,61,660కే తగ్గాయని విమర్శించారు.
బ్యాంకు లోన్ల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు
''గత టీడీపీ ప్రభుత్వం హైటెక్ సాంకేతికత,అత్యున్నత నాణ్యతతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని''పేర్కొన్నారు. అయితే,"ఇలాంటి సంక్షోభంలో,లబ్ధిదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని" ఆరోపించారు. మునిసిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే లబ్ధిదారులు బ్యాంకు లోన్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని,అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పైన బ్యాంకు లోన్లు తీసుకున్న వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక,గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. టిడ్కో ఇళ్ల పైన రంగులు మార్చడానికే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అలాగే,టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కల్పన కోసం 5200కోట్ల రూపాయల నిధులు అవసరం అని వెల్లడించారు. ఈ అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.