Page Loader
Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి 
Miss World 2025: యాదగిరిగుట్ట..పోచంపల్లిలో 'ప్రపంచ సుందరి' పోటీదారులు

Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆధ్యాత్మిక మహత్వం కలిగిన యాదగిరిగుట్ట, భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లిలో గురువారం ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. స్వర్ణతాపంతో ప్రకాశించే యాదాద్రీశుడి గోపురాలు, కృష్ణశిలతో నిర్మించిన ఆలయ ప్రాకారాలు, చారిత్రక, ఆధ్యాత్మిక విలువలు కలిగిన స్తంభోద్భవుడి వైభవాన్ని వీరు ఆసక్తిగా తిలకించారు. సంప్రదాయ పట్టుపరికిణీలు, శుభ్రమైన పట్టుచీరలు ధరించి, నుదుటన తిలకం ధరించి, లయబద్ధంగా నడుస్తూ అఖండదీపాన్ని వెలిగించారు. ఆలయ అర్చకుడు నర్సింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

వివరాలు 

గోపురాలు,స్వర్ణతాపం,ప్రాకారాల వద్ద ఫోటోషూట్ 

ఆఫ్రికా, కరేబియన్‌ దేశాలకు చెందిన సుందరీమణులు,గురువారం సాయంత్రం 5 గంటలకు పర్యాటక శాఖ ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. అక్కడి ప్రోటోకాల్‌ అతిథిగృహంలో ప్రొజెక్టర్‌ ద్వారా దేవస్థాన విశిష్టతల్ని వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు వివరించారు. ఆపై సంప్రదాయ వేషధారణతో ముస్తాబైన సుందరీమణులు కోలాటం,భజనల మధ్య తూర్పు రాజగోపురానికి చేరుకుని అక్కడి గోపురాలు,స్వర్ణతాపం,ప్రాకారాల వద్ద ఫోటోషూట్లలో పాల్గొన్నారు. తూర్పు మహాగోపురం వద్ద వేదపండితులు స్వాగతం పలికారు.అనంతరం వారు ఆలయంలోకి ప్రవేశించి అఖండ దీప మండపం వద్ద దీపారాధన చేశారు. వారికి ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,కలెక్టర్‌ హనుమంతరావు,ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనంతోపాటు వేదపండితుల ఆశీర్వచనాలు, ప్రసాదాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రతిమలు, జ్ఞాపికలను అందించారు.

వివరాలు 

శిల్పకళకు ముగ్ధులైన అందగత్తెలు 

కృష్ణశిలతో నిర్మించిన ఆలయ గోపురాలు, ప్రాకారాలు, దేవాలయ శిల్పకళను చూసిన సుందరీమణులు మంత్రముగ్ధులయ్యారు. సెల్‌ఫోన్‌లలో ఫోటోలు తీశారు. శిల్పాల నేపథ్యంతో బృందచిత్రాలు తీసుకుని ఆనందించారు. ఆలయంలో భక్త మహిళలు చేస్తున్న కోలాట నృత్యాలలో అందగత్తెలు కూడా పాల్గొని లయబద్ధంగా చక్కటి నృత్యాలు చేశారు. స్థానికులతో సన్నిహితంగా రెండు చేతులు జోడించి నమస్కారం చెబుతూ, "బాగున్నారా?" అని చిరునవ్వుతో పలకరించిన వీరి ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. "ఇక్కడి పూజా పద్దతులు, ఏకశిలతో నిర్మించిన ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉంది. వీలైతే మళ్లీ రావాలనుంది" అని కొంతమంది పోటీదారులు స్పందించారు. రాత్రి 7:15 గంటలకు బస్సులలో తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.

వివరాలు 

పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణుల పర్యటన 

గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది మిస్‌ వరల్డ్‌ పోటీదారులు పోచంపల్లిలో పర్యటించారు. సిల్క్‌సిటీగా పేరుగాంచిన పోచంపల్లిలోని చేనేత కళను వీరు కళ్లారా చూశారు. గ్రామీణ పర్యాటక కేంద్ర సందర్శనతో ప్రారంభమై చీరల తయారీ ప్రక్రియను పరిశీలించారు. టూరిజం పార్కు వద్ద ఫోటోలు తీయడంతో పాటు, "తెలంగాణ జరూర్‌ ఆనా" అంటూ నినాదాలు చేశారు. అనంతరం రెండు బృందాలుగా ఇక్కత్‌ మ్యూజియంకు వెళ్లి డిజైన్లను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పోచంపల్లి, వెంకటగిరి, గొల్లభామ, నారాయణపేట వస్త్ర ప్రదర్శనలను తిలకించారు. యాంపీ థియేటర్‌లో పోచంపల్లి చరిత్ర, హ్యాండ్లూమ్‌పై ప్రదర్శించిన వీడియోను వీక్షించారు.

వివరాలు 

టెక్స్‌టైల్‌ టూరిజానికి మార్గనిర్దేశకంగా పోచంపల్లి 

ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాంప్‌ వాక్, ఇక్కత్‌ వస్త్రాల ఫ్యాషన్‌ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో సినిమాల్లో నటించిన దివి, విదేశీ మోడళ్లతో కలిసి చీరకట్టులో ర్యాంప్‌ వాక్‌ చేశారు. భౌగోళిక గుర్తింపు పొందిన ఇక్కత్‌ వస్త్రాలతో పాటు గ్రామీణ పర్యాటక రంగంలో పోచంపల్లి ప్రపంచ గుర్తింపు పొందిందని, ఇకపై ఇది టెక్స్‌టైల్‌ టూరిజంలో ప్రపంచదేశాలకు మార్గనిర్దేశకంగా నిలుస్తుందని యాదాద్రి కలెక్టర్‌ హనుమంతరావు వ్యాఖ్యానించారు.

వివరాలు 

వివిధ పర్యాటక కేంద్రాల్లో మిస్‌ వరల్డ్‌ బృందాలు 

ప్రపంచ సుందరీమణులు శుక్రవారం మూడు బృందాలుగా విభజించి మూడు వేర్వేరు ప్రదేశాల్లో పర్యటించనున్నారు. వైద్య పర్యాటకంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని, చరిత్రాత్మక పిల్లలమర్రిని (మహబూబ్‌నగర్‌ జిల్లా), హైదరాబాద్‌ శివారులోని ఎక్స్‌పీరియం ఎకోటూరిజం పార్కును సందర్శించనున్నారు. వీరిలో 40 మంది సభ్యుల బృందం ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని దేశీ, విదేశీ రోగులకు అందించే చికిత్సల విధానాలను తెలుసుకుంటారు. ఏఐజీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ డీ. నాగేశ్వరరెడ్డి మరియు ఇతర వైద్య నిపుణులు చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యం, హెల్త్‌కేర్, బ్యూటీ, ఫిట్‌నెస్‌, డైట్‌ తదితర అంశాలపై వివరాలు ఇస్తారు.