Khammam: బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాలు,వరదలతో ఉప్పొంగిన బేతుపల్లి చెరువులో మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు గురువారం ధ్రువీకరించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఆందోళన నెలకొనగా.. సిబ్బంది సురక్షితంగా ఉన్నారనే సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు,ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించింది. చెరువు మధ్యలో కొందరు మత్స్యకారులు చిక్కుకుపోయారనే సమాచారంతో వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన 10మంది సిబ్బంది,ఓ స్థానిక వ్యక్తి కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న సేఫ్టీ బోట్లు ప్రమాదవశాత్తూ చెరువులోని వరద ఉధృతికి బోల్తా పడ్డాయి.
వివరాలు
మరో ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం
దీంతో బోట్లలో ఉన్న సిబ్బంది,స్థానిక వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
బుధవారం రాత్రి బోట్లు బోల్తా పడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.చీకటి,వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి.
కొట్టుకుపోయిన వారిలో ఐదుగురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మరో ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది.
మిగిలిన ముగ్గురు సిబ్బంది ఆచూకీ తెలియకపోవడంతో రాత్రంతా ఆందోళన కొనసాగింది.
గురువారం ఉదయం గల్లంతైన ముగ్గురు సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
వారు చెరువులోని సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో వారిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రత్యేక బోట్లు,అదనపు సిబ్బందితో సహాయకచర్యలు ముమ్మరం చేశారు.
గల్లంతైన వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రెస్క్యూఆపరేషన్ కొనసాగుతోంది.
వివరాలు
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
జిల్లావ్యాప్తంగా 15 వేల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగినట్లు అంచనా. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు నష్టం వాటిల్లింది.
ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అశ్వారావుపేటలో అత్యధికంగా 25.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దమ్మపేట మండలం మల్కారంలో 18.7, అంకంపాలెంలో 14.8, ములకపల్లిలో 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వివరాలు
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం
భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్ కొట్టుకుపోయింది.
దీంతో వందల ఎకరాలు నీట మునిగాయి. పాల్వంచ ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.