LOADING...
PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నారు. ఆయన అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డోజ్‌ అధిపతి ఎలాన్ మస్క్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా భారతీయుల నుంచి ప్రధానికి ఘన స్వాగతం లభించింది. మోదీ ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిథి గృహాల్లో ఒకటైన బ్లేయర్ హౌస్‌లో బస చేస్తున్నారు. 1651 పెన్సిల్వేనియా అవెన్యూలో ఉన్న ఈ భవనం శ్వేతసౌధానికి ఎదురుగా ఉండటం దీని ప్రత్యేకత. అమెరికా పర్యటనకు వచ్చే అత్యంత ముఖ్యమైన అతిథులకు ఇక్కడే వసతి కల్పిస్తారు. ఇప్పటివరకు పలువురు దేశాధినేతలు, రాజకుటుంబ సభ్యులు ఇక్కడ బస చేశారు.

Details

70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 119 గదులు

దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యమున్న భవనంగా బ్లేయర్ హౌస్‌ గుర్తింపు పొందింది. ఇది కేవలం విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌ మాత్రమే కాకుండా, అమెరికా ఆతిథ్య సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు భవనాలు అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ మొత్తం 119 గదులు ఉన్నాయి. వీటిలో 14 బెడ్రూమ్‌లు, 35 బాత్‌రూమ్‌లు, మూడు డైనింగ్‌ గదులు ఉన్నాయి. అదనంగా, అత్యాధునిక బ్యూటీ సెలూన్‌ సౌకర్యం కూడా ఉంది. ఫైవ్‌స్టార్ స్థాయిలో అతిథులకు సేవలు అందిస్తూ, అమెరికా చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన వస్తువులు, కళాఖండాలతో ఈ భవనాన్ని అలంకరించారు.

Details

1824లో నిర్మాణం

ఈ భవనాన్ని 1824లో నిర్మించారు. 1837లో ప్రెస్టన్‌ ఫ్రాన్సిస్‌ బ్లేయర్‌ కొనుగోలు చేయగా, వారి పేరుతో దీని పేరు బ్లేయర్ హౌస్‌గా స్థిరపడింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం శ్వేతసౌధంలోని అతిథుల సంఖ్య పెరగడంతో 1942లో అమెరికా ప్రభుత్వం బ్లేయర్ హౌస్‌ను అద్దెకు తీసుకుని, అదే ఏడాది చివరికి 1.56 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్ (DNI) తులసీ గబ్బర్డ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. విశేషంగా, తులసీ గబ్బర్డ్‌ తాజాగా DNIగా పదవీ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.