వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమోఘ్ లీలా దాస్ తన ప్రవచనాల్లో భాగంగా ఇలా అన్నారు. స్వామి వివేకానంద చేపలు తింటారని చెప్పారు. 'సత్పురుషుడు చేపలు తింటారా? చేప కూడా నొప్పిని అనుభవిస్తుంది కదా, అది సరియైనదా?' అని దాస్ అన్నారు. అలాగే స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంసపై కూడా ఆయన వివాదాస్పంగా మాట్లాడారు. రామకృష్ణ బోధించిన 'జాతో మత్ తతో పథ్'(ఎన్ని అభిప్రాయాలు, అనేక మార్గాలు)పై అమోఘ్ వ్యంగ్యంగా స్పందించారు.
అమోఘ్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
అమోఘ్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అది తీవ్ర విమర్శలకు దారి తీసింది. టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ, తాము ఇస్కాన్‌ను గౌరవిస్తామని, అమోఘ్ దాస్‌పై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. అమోఘ్ లీలా దాస్ చేసిన ఈ తీవ్రమైన తప్పును దృష్టిలో ఉంచుకుని అతన్ని నెల రోజులు నిషేధించినట్లు ఇస్కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాస్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారని, అతను ఎంత పెద్ద అపచారం చేశారో గ్రహించారని ఇస్కాన్ వెల్లడించింది. దాస్ తన ప్రాయశ్చిత్తం కోసం గోవర్ధన్ కొండల్లో ప్రజాజీవితానికి దూరంగా, ఒంటరిగా జీవిస్తారని ఇస్కాన్ పేర్కొంది.