Telangana: బంగారం కంటే ఖరీదు ఎక్కువ.. కిలో మామిడి ధర రూ.2.5 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన అత్యంత ఖరీదైన మియాజకి రకం మామిడి పండ్లను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో విజయవంతంగా పండించారు. సాధారణంగా ఈ రకం మామిడి శీతల వాతావరణంలో మాత్రమే పెరుగుతుందని, స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకోదని కొందరు హెచ్చరించినప్పటికీ, ప్రయత్నించి చూస్తామని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం ముందుకు వచ్చారు. ఆయన కేరళలోని ఓ ఏజెన్సీ ద్వారా ఒక్కో మొక్కకు రూ.10 వేల ఖర్చుతో ఆరు మియాజకి మొక్కలను తెప్పించి నాటారు. వాటిలో ఒక మొక్క చనిపోగా మిగతా ఐదు మొక్కలు బాగా ఎదిగాయి.
వివరాలు
స్థానిక ఎమ్మెల్యేకు పండ్లు అందజేత
రెండున్నరేళ్లకే ఈ చెట్లు ఎదిగి కాత కాయడం ప్రారంభించాయి. డాక్టర్ సత్యం నవాబుపేటలోని తన సత్యం ట్రెడిషనల్ ఆయుర్వేద ఆశ్రమం ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ క్రమంలో, ఈ ప్రాంతంలో అసాధ్యమని భావించిన మామిడి పంట కాతకు రావడం ఆయనను ఆనందానికి గురి చేసింది. మియాజకి మామిడి పండ్ల ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉండటం విశేషం. ఈ పంట విలువను తెలియజేసేందుకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను కలసి డాక్టర్ సత్యం వివరాలు తెలియజేసి పండ్లను అందజేశారు.
వివరాలు
ఈ రకం సాగు చాలా అరుదు
ఇదిలా ఉండగా, మియాజకి మామిడిపై స్పందించిన ఉద్యానవన అధికారి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఈ రకం సాగు కావడం చాలా అరుదని తెలిపారు. కాత కాసినా మార్కెటింగ్ సమస్యలు ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.