LOADING...
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత..
ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత..

Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత..

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ బుధవారం లక్నోలో కన్నుమూశారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. ఉదయం అస్వస్థతకు గురైన ప్రతీక్‌ను కుటుంబ సభ్యులు లక్నో సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన బీజేపీ నేత అపర్ణ యాదవ్ భర్త కాగా,మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సవతి సోదరుడు. ప్రతీక్ యాదవ్ చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం విషమించిందని సమాచారం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యులబృందం సిద్ధమైంది. శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

2017లో రూ.5 కోట్ల విలువైన లంబోర్గిని కారు కొనుగోలు

ఎంబీఏ పూర్తి చేసిన ప్రతీక్ యాదవ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా, ఫిట్‌నెస్ లవర్ గా గుర్తింపు పొందారు. 2012లో అంతర్జాతీయ బాడీబిల్డింగ్ వెబ్‌సైట్‌లో "ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ది మంత్"గా నిలిచారు. జంతు సంక్షేమ కార్యక్రమాలపైనా ఆయన ఆసక్తి చూపేవారు. 2017లో రూ.5 కోట్ల విలువైన లంబోర్గిని కారు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఆ కారును రుణంపై కొనుగోలు చేశానని, అన్ని పత్రాలు చట్టబద్ధంగానే ఉన్నాయని అప్పట్లో స్పష్టం చేశారు. రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

వివరాలు 

యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం

2011లో ప్రతీక్ యాదవ్, అపర్ణ యాదవ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రతీక్ యాదవ్, అపర్ణ యాదవ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. విడాకులు తీసుకోనున్నట్లు ఇద్దరూ ప్రకటించి వార్తల్లో నిలిచారు. అయితే తర్వాత ఆ నిర్ణయంపై ముందుకు వెళ్లలేదు. ప్రతీక్ యాదవ్ మృతి వార్తతో యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement