ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు
ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది. భర్తకు భార్య విడాకులు ఇచ్చే ప్రక్రియను అరబిక్‌లో 'ఖులా'ను అంటారు. భార్యకు భర్త విడాకులు ఇచ్చే ప్రక్రియను 'తలాక్' అంటారు. అయితే కొందరు ముస్లిం మహిళలు విడాకులు కావాలంటే షరియత్ కౌన్సిల్ సంస్థల వద్దకు వెళ్లి 'ఖులా' ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. ఓ ముస్లిం మహిళ ప్రైవేటు సంస్థ నుంచి ఖులా సర్టిఫికెట్ పొందగా, ఆమె భర్త మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు చెప్పింది.
కుటుంబ న్యాయస్థానాలకు మాత్రమే అధికారం
ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ కోర్టుల చట్టంలోని సెక్షన్ 7(1)(బి), ముస్లిం పర్సనల్ లా(షరియత్), ముస్లిం వివాహాల రద్దు చట్టంప్రకారం దేశంలో వివాహాలను రద్దు చేయడానికి కుటుంబ న్యాయస్థానాలకు మాత్రమే అధికారం ఉంటుంది. 2017లో కూడా ఇలాంటి కేసు ఒకటి మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ శరవణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లి మహిళకు 'ఖులా' ద్వారా వివాహాన్ని రద్దుచేసుకునే హక్కు ఉందని చెప్పారు. అది ముస్లిం పర్సనల్ లా ప్రకారం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా షరియత్ కౌన్సిల్ జారీ చేసిన ఖులా సర్టిఫికేట్‌ను కొట్టివేశారు.