కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం
కృష్ణ జన్మభూమి వివాద స్థలంపై ఉత్తరప్రదేశ్‌లోని మథుర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత.. షాహీ ఈద్గా మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. జనవరి 20 తర్వాత నివేదికను సమర్పించాలని సూచించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సర్వే మాదిరిగానే.. ఈ సర్వే చేయాలని ధర్మాసనం చెప్పింది. 'హిందూ సేన' అనే సంస్థకు చెందిన విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. విచారించి.. సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. విష్ణు గుప్తా తరపున న్యాయవాది శైలేష్ దూబే కోర్టులో వాదించారు. శ్రీకృష్ణుని జననం నుంచి ఆలయ నిర్మాణం వరకు మొత్తం చరిత్రను ఆయన కోర్టు ముందుంచారు.
ఔరంగజేబు హయాంలో..
17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా మసీదును కత్రా కేశవ్ దేవ్ ఆలయం నుంచి తొలగించాలని రైట్ వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 1669-70లో ఔరంగజేబు శ్రీకృష్ణుడి ఆలయంలోని 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఈమసీదును నిర్మించినట్లు హిందూ సంఘాలు వాదిస్తున్నారు. ఇలాంటి కేసులు ప్రస్తుతం పలు కోర్టులు విచారణ దశలో ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞాన్‌వాపి అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలతో జ్ఞాన్‌వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పుడు షాహీఈద్గా మసీదులో విషయంలో అలాగే సర్వేకు ఆదేలివ్వగా.. ఇక్కడ కూడా హిందూ దేవుళ్ల విగ్రహాలు బయట పడుతాయా? పడవా? అనేది ఆసక్తికరంగా మారింది.