Page Loader
Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి
నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి

Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై అతడి తల్లి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే తగిన శిక్ష విధించాలని ఆమె పేర్కొన్నారు. ఒక మహిళగా తన కుమారుడు చేసిన నేరాన్ని ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముగ్గురు కుమార్తెల తల్లినని, వైద్యురాలు అనుభవించిన బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. తన కొడుకు చనిపోతే తాను బాధపడతానని, కానీ అతడు ఓ అమ్మాయిపై ప్రవర్తించిన తీరుకు జీవించే హక్కు లేదన్నారు.

Details

సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్ధేశం లేదు

అతడికి మరణ శిక్ష విధించినా తాము ఎటువంటి అభ్యంతరం చెప్పమని, బాధితురాలు కూడా తనకు కూతురిలాంటిదేనని ఆమె భావోద్వేగంగా చెప్పారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి స్పందించారు. ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అతడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తాము ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. నేరం జరిగిన సమయంలో సంజయ్‌తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని, పోలీసులు, సీబీఐ ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని ఆమె కోరారు.