LOADING...
Gudivada: వేంకటేశ్వర స్వామివారి బంగారు కిరీటం తాకట్టు.. గుడివాడలో కలకలం.. దేవాదాయశాఖ దర్యాప్తు
గుడివాడలో కలకలం.. దేవాదాయశాఖ దర్యాప్తు

Gudivada: వేంకటేశ్వర స్వామివారి బంగారు కిరీటం తాకట్టు.. గుడివాడలో కలకలం.. దేవాదాయశాఖ దర్యాప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించిన వజ్రాలతో అలంకరించిన బంగారు కిరీటం కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దేవాదాయశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ లలిత ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానం ట్రస్ట్‌ కార్యాలయ తాళాలు, సంబంధిత రికార్డులు ఇవ్వాలని కోరారు. అయితే ట్రస్ట్‌బోర్డులోని 31 మంది సభ్యులు అందుబాటులో లేరని ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చినా ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

ట్రస్ట్‌బోర్డుపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం

ఈ వ్యవహారంపై దాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. మధ్యాహ్నంలోపు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సహాయ కమిషనర్‌ లలిత ఆలయ ప్రాంగణంలోనే ఉండి విచారణ కొనసాగించారు. ఆలయ కమిటీ దేవాదాయశాఖ పరిధిలో లేకపోవడంతో ట్రస్ట్‌బోర్డుపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేదని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, కిరీటం తాకట్టు వ్యవహారం బయటపడటంతో బంగారం తాకట్టు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలిసింది. తన ఖాతాలోకి తాకట్టు సొమ్ము జమ చేస్తేనే గ్రామానికి వస్తానని మధ్యవర్తుల ద్వారా ట్రస్ట్‌బోర్డుకు సమాచారం పంపినట్లు వెల్లడైంది.

వివరాలు 

కిరీటం మాయం.. వెలుగులోకి ఇలా..

గుడివాడలోని ఆర్యవైశ్య కల్యాణ మండపానికి చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 2025 జనవరిలో మాటూరి సుబ్బారావు విలువైన కానుక సమర్పించారు. రూ.70 లక్షల విలువ చేసే,461 గ్రాముల బరువున్న వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని స్వామివారికి అందజేశారు. కొద్ది రోజుల క్రితం సుబ్బారావు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే తాను సమర్పించిన కిరీటం కనిపించకపోవడంతో ఆలయ కమిటీ సభ్యులను ప్రశ్నించారు.

Advertisement

వివరాలు 

కిరీటం మాయం.. వెలుగులోకి ఇలా..

కిరీటం బ్యాంకు లాకరులో ఉందని వారు సమాధానం ఇచ్చారు. తర్వాత మరోసారి ఆలయానికి వెళ్లిన సుబ్బారావు.. "నాకు 81 ఏళ్లు. స్వామివారికి కిరీటం అలంకరించి ఒక్కసారి చూపించండి" అని కోరారు. ఈసారి కూడా వేరే బ్యాంకు లాకరులో ఉందని చెప్పడంతో ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో సుబ్బారావు ఆరా తీయగా, కల్యాణ మండపం ఆధునికీకరణ పనుల కోసం కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై భక్తుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement