Weather Report: జులైలోనూ తగ్గని ఎండల తీవ్రత.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కపోత, చెమటతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ స్థాయి కంటే 3.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 30 శాతానికి పడిపోవడంతో వేడి ప్రభావం మరింత పెరిగింది. తేమ తగ్గడం వల్ల ఉక్కపోత అధికమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వివరాలు
నల్గొండ జిల్లాలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
ఈ పరిస్థితులు మరో రెండురోజుల పాటు కొనసాగనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీంతో ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 నుంచి 3.9డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి.
శనివారం రాత్రి హకీంపేటలో సాధారణంగా 22డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన ఉష్ణోగ్రత 3.9డిగ్రీలు పెరిగి 25.9డిగ్రీల సెల్సియస్కు చేరింది.
ఇక రామగుండంలో రాత్రి సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 27.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోతోంది. పగలు ఎండలు,రాత్రి వేడి కలిసి రాష్ట్రవ్యాప్తంగా అసౌకర్యకర వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి.