Loading...
New AEDP Degree Courses: అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన
అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన

New AEDP Degree Courses: అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సులకు భిన్నంగా వీటిని తీర్చిదిద్దింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్ల సహకారంతో ఈ కోర్సులను సిద్ధం చేసింది. ఈ ఏడాది నుంచే ఏఈడీపీ కోర్సులను అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లింది. గతంలో డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు, కొత్త కోర్సులకు అనుమతులు మంజూరు చేసే అధికారం ఉన్నత విద్యామండలికే ఉండేది. దీంతో అవసరానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయడం, కొత్త కోర్సులను అమలు చేయడం సులభంగా సాగేది.

వివరాలు 

ఏఈడీపీ కోర్సుల రూపకల్పన పూర్తిచేసిన ఉన్నత విద్యామండలి

అయితే ఇటీవల ఉన్నత విద్యామండలి వద్ద ఉన్న ఈ అధికారాలను తొలగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఈ బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ అప్పగించింది.

దీంతో ప్రస్తుతం కోర్సులను, సిలబస్‌ను రూపొందించే బాధ్యత ఉన్నత విద్యామండలికి ఉన్నప్పటికీ.. వాటిని ఎప్పటి నుంచి అమలు చేయాలనే తుది అధికారం ఉన్నత విద్య కమిషనరేట్‌ వద్ద ఉంది.

ఏఈడీపీ కోర్సుల రూపకల్పన పూర్తిచేసిన ఉన్నత విద్యామండలి.. వాటి అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషనరేట్‌కు పంపించింది.

వివరాలు 

ఈ ఏడాది నుంచే అమలు చేస్తారా?

ఏఈడీపీ కోర్సులను ఈ ఏడాది నుంచే అమల్లోకి తీసుకురావడంపై ఉన్నత విద్య కమిషనరేట్‌ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కొత్త కోర్సుల అమలుకు కనీసం వారం రోజుల సమయం ఇస్తే సరిపోతుందని ఉన్నత విద్యామండలి చెబుతోంది.

అయితే ఈ ఏడాదే వాటిని ప్రారంభించేందుకు అవసరమైన సమయం లేదని ఉన్నత విద్య కమిషనరేట్‌ అభిప్రాయపడుతోంది.

దీంతో ఏఈడీపీ కోర్సుల అమలు ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

సింగిల్‌ మేజర్‌ విధానంలోనే..

ప్రస్తుతం డిగ్రీలో అమల్లో ఉన్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్నే ఏఈడీపీ కోర్సుల్లోనూ అనుసరిస్తున్నారు.

మూడేళ్ల డిగ్రీలో చివరి ఏడాది మొత్తం ఉపకార వేతనాలతో కూడిన అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది.

ఈ అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలను సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు కల్పిస్తాయి. ప్రతి ఏడాది ఈ కోర్సుల్లో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ప్రవేశాలు,అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

మూడేళ్ల డిగ్రీకి మొత్తం 126 క్రెడిట్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌కు 22, రెండో సెమిస్టర్‌కు 24 క్రెడిట్లు కేటాయించారు.

కమ్యూనిటీ ప్రాజెక్టుకు ఒక క్రెడిట్‌ ఉంటుంది. మూడో సెమిస్టర్‌లో 30, నాలుగో సెమిస్టర్‌లో 24 క్రెడిట్లు ఉంటాయి.

ఐదో, ఆరో సెమిస్టర్లలో పూర్తిగా అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది. దీనికి 25 క్రెడిట్లు కేటాయించారు.

ADVERTISEMENT

వివరాలు 

సాధారణ డిగ్రీలతోపాటు..

నాలుగేళ్ల డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు మొత్తం 170 క్రెడిట్లు ఉంటాయి. ఏడో సెమిస్టర్‌కు 22, ఎనిమిదో సెమిస్టర్‌కు 22 క్రెడిట్లు కేటాయించారు.

సాధారణ డిగ్రీ కోర్సులతోపాటు ఏఈడీపీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు.

ఈ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు డిగ్రీ చదువుతూనే పరిశ్రమల్లో పని చేసే అవకాశం పొందుతారు.

చదువు పూర్తయ్యే సమయానికే పరిశ్రమ అవసరాలపై అవగాహన, ప్రాక్టికల్‌ అనుభవం ఏర్పడటంతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో అమలు

రాష్ట్రంలోని కొన్ని స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే ఇలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఏడు ప్రభుత్వ అటానమస్‌ కళాశాలల్లోనూ కొన్ని అప్రెంటిస్‌షిప్‌ ఆధారిత కోర్సులు ఉన్నాయి.

ఇందులో మూడేళ్లకు సంబంధించిన థియరీ పేపర్లను రెండేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

అటానమస్‌ కళాశాలలకు సిలబస్‌, కోర్సు డిజైన్‌లో కొంత వెసులుబాటు ఉండటంతో అందుకు అనుగుణంగా కోర్సులను సర్దుబాటు చేసుకుంటున్నాయి.

అప్రెంటిస్‌షిప్‌ కోర్సులను అమలు చేసే కళాశాలలతో సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు ఒప్పందాలు చేసుకుంటాయి.

అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పించడం, ఇతర అవసరమైన సహాయ సహకారాలు అందించడం వంటి బాధ్యతలను చేపడతాయి.

వివరాలు 

అందుబాటులోకి రానున్న అప్రెంటిస్‌షిప్‌ కోర్సులు

కేంద్ర ప్రభుత్వ బోర్డ్స్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ (బోట్‌)తోనూ కొన్ని కళాశాలలు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఏఈడీపీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. వారు మూడో ఏడాదికి చేరుకునే సమయానికి సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిళ్లు లేదా బోట్‌ ద్వారా అప్రెంటిస్‌షిప్‌ సదుపాయం కల్పించే అవకాశం ఉంటుంది.

బీఎస్సీలో..

ఎలక్ట్రానిక్స్‌ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఈ-మొబిలిటీ-బ్యాటరీ, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, సెమీకండక్టర్‌-కాంపొనెంట్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌-ఐఓటీ, ఆటోమోటివ్‌ సేల్స్‌, ఆటోమోటివ్‌ టెక్నాలజీ, ఆటోమోటివ్‌ మెకట్రానిక్స్‌, యానిమేషన్‌-వీఎఫ్‌ఎక్స్‌, గేమ్‌ ఆర్ట్‌-డిజైన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌-అడ్వర్టైజింగ్‌, ఫిల్మ్‌-టీవీ ప్రొడక్షన్‌, మీడియా కమ్యూనికేషన్‌, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి.

వివరాలు 

బీకాంలో

అగ్రి స్టోరేజ్‌-సప్లై చైన్‌, ఎయిర్‌ కార్గో లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌ ఆపరేషన్‌, లాజిస్టిక్స్‌, మారిటైమ్‌ లాజిస్టిక్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, రీటెయిల్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రతిపాదించారు.

బీబీఏలో..

ఏఐ ఆగ్‌మెంటెడ్‌ కస్టమర్‌ సపోర్ట్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

బీఏలో..

కంటెంట్‌, క్రియేటివ్‌ రైటింగ్‌ కోర్సులను ఏఈడీపీ విధానంలో అందించనున్నారు.

ADVERTISEMENT