TIDCO: పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+8 నుంచి జీ+14 వరకు నిర్మాణాలు
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జీ+8, జీ+10, జీ+12, జీ+14 తరహాలో.. అంటే గ్రౌండ్ ప్లస్ 8, 10, 12, 14 అంతస్తులతో భవనాలను నిర్మించనున్నారు. ఊరికి దూరంగా, ఉపాధి అవకాశాలు లేని ప్రాంతాల్లో కాకుండా.. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలం లభ్యతను బట్టి ఏ తరహా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయిస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ మందికి ఇళ్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు. కొత్త టిడ్కో భవనాల్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రస్తుతం టిడ్కో సముదాయాల్లో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తున్నారు.
వివరాలు
430 చదరపు అడుగుల్లోనే కొత్త ఇళ్లు
అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇకపై చేపట్టే నిర్మాణాలన్నీ 430 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉండనున్నాయి.
ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారుల సంఖ్యను బట్టి నిర్మించాల్సిన టవర్ల సంఖ్యను ఖరారు చేస్తారు.
ఇప్పటికే ఇలాంటి గృహ నిర్మాణాలు చేపడుతున్న గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారు.
అక్కడి నిర్మాణ విధానాలను పరిశీలించిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్‌లో వాణిజ్య సముదాయాలు
కొత్తగా నిర్మించనున్న టిడ్కో భవన సముదాయాలకు సంబంధించిన డిజైన్‌ను అధికారులు ఇప్పటికే రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.
ఈ ప్రతిపాదిత నమూనాకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
డిజైన్ ప్రకారం స్టిల్ట్ ఏరియాలో దుకాణాలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు. వాటి పై అంతస్తుల నుంచి లబ్ధిదారుల ఫ్లాట్లు ఉంటాయి.
ప్రతిపాదిత నిర్మాణాల సామర్థ్యం ఇలా.. ఎస్+జీ+8 భవనంలో గరిష్ఠంగా 2,040 ఫ్లాట్లు ఎస్+జీ+10 భవనంలో గరిష్ఠంగా 2,496 ఫ్లాట్లు ఎస్+జీ+12 భవనంలో గరిష్ఠంగా 2,952 ఫ్లాట్లు ఎస్+జీ+14 భవనంలో గరిష్ఠంగా 3,408 ఫ్లాట్లు
వివరాలు
నిర్మాణ వ్యయం భారీగా పెరుగుదల
2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం జీ+3 తరహాలో టిడ్కో గృహ సముదాయాలను చేపట్టినప్పుడు ఒక్కో ఫ్లాటు నిర్మాణ వ్యయం గరిష్ఠంగా రూ.8.50 లక్షల వరకు ఉండేది.
ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.3 లక్షలు కాగా.. మౌలిక సదుపాయాల కోసం రూ.90 వేలు కేటాయించారు.
మిగిలిన మొత్తంలో ఇంటి విస్తీర్ణాన్ని బట్టి మూడు రకాల ఫ్లాట్లకు రూ.2.65 లక్షల నుంచి రూ.4.65 లక్షల వరకు లబ్ధిదారుల వాటాగా చెల్లించేలా అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు.
ఆ విధానంలో దాదాపు 3.05 లక్షల ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.
వీటిలో ఇప్పటికే 80శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందించారు.
మిగిలిన ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
10 ఎకరాల్లో టవర్ నిర్మాణానికి అంచనాలు
ఆ తర్వాత కొత్త నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
అయితే ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరగడంతో.. ఆ ప్రభావం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణ వ్యయంపైనా పడుతోంది.
ప్రస్తుత ధరల ప్రకారం 10ఎకరాల విస్తీర్ణంలో ఒక టవర్ నిర్మించేందుకు అయ్యే వ్యయాన్ని అధికారులు అంచనా వేశారు.ఆ వివరాల ప్రకారం.. ఎస్+జీ+8 నిర్మాణానికి రూ.357 కోట్లు ఎస్+జీ+10 నిర్మాణానికి రూ.412.43 కోట్లు ఎస్+జీ+12 నిర్మాణానికి రూ.476.35 కోట్లు ఎస్+జీ+14 నిర్మాణానికి రూ.535.19 కోట్లు
అంతస్తులు పెరిగే కొద్దీ చదరపు అడుగుపై అయ్యే నిర్మాణ వ్యయం తగ్గుతుందని అధికారులు లెక్కించారు.
ఎస్+జీ+8లో చదరపు అడుగుకు రూ.3,100,ఎస్+జీ+10లో రూ.3,000,ఎస్+జీ+12లో రూ.2,985, ఎస్+జీ+14లో రూ.2,945గా అంచనా వేశారు.
వివరాలు
ఫ్లాటు ధరల ప్రతిపాదన
430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఫ్లాట్లకు ప్రతిపాదిత ధరలు ఇలా ఉన్నాయి.. ఎస్+జీ+8లో ఒక్కో ఫ్లాటు ధర రూ.17.51 లక్షలు ఎస్+జీ+10లో ఒక్కో ఫ్లాటు ధర రూ.16.52 లక్షలు ఎస్+జీ+12లో ఒక్కో ఫ్లాటు ధర రూ.16.14 లక్షలు ఎస్+జీ+14లో ఒక్కో ఫ్లాటు ధర రూ.15.70 లక్షలు
ఈ ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.3 లక్షలు మినహాయించి.. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించేలా ప్రతిపాదించారు. ఈ నిర్మాణాలన్నీ 430 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే చేపట్టనున్నారు.
వివరాలు
పట్టణ ఇళ్ల కోసం 24 వేల దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం డిమాండ్ సర్వే నిర్వహిస్తోంది.
గత నెలలో ప్రారంభమైన ఈ సర్వేకు ఇప్పటివరకు వివిధ పురపాలక సంఘాల నుంచి 24 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా: 11,185 నెల్లూరు జిల్లా: 4,590 ఎన్టీఆర్ జిల్లా: 2,849 ప్రకాశం జిల్లా: 2,122 కర్నూలు జిల్లా: 1,338
మిగతా జిల్లాల్లో 50 నుంచి 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.