Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు పౌరుల కాల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి తుపాకులతో రెచ్చిపోయారు.
తౌబాల్ జిల్లాలోని లిలాంగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని మిలిటెంట్లు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో మిలిటెంట్లు తుపాకులతో విరుచుపడటంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
దీంతో తౌబాల్, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం మళ్లీ కర్ఫ్యూ విధించింది.
అయితే మరణించిన వారి మృతదేహాలను ఇంకా వెలికితీయలేదు. సాయుధులైన దుండగులు పౌరులపై కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు.
శాంతిభద్రతల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తగా.. డిసెంబర్ 31, 2023 నాటి కర్ఫ్యూ సడలింపు ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.
మణిపూర్
లిలాంగ్ ప్రాంతంలో హింసకు పాల్పడొద్దు: ముఖ్యమంత్రి బీరెన్ సింగ్
పూర్తిస్థాయి కర్ఫ్యూ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో తక్షణమే అమలులోకి వస్తుందని ఇంఫాల్ వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
లిలాంగ్ ప్రాంతంలో హింసకు పాల్పడొద్దని, ప్రశాంతతను కొనసాగించాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఒక ప్రకటనలో కోరారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అంత తేలికగా తీసుకోదని, నిందితులను పట్టుకునేందుకు మరింత మంది పోలీసులను రంగంలోకి దింపుతామని చెప్పారు.
జాతి ఘర్షణల కారణంగా మణిపూర్‌లో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయి.
ఈశాన్య రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి సుమారు 10,000 మంది సైన్యం, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు.