Loading...
UP Government Jobs New Rules: యూపీ ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నిబంధనలు.. యోగి సర్కారు కీలక నిర్ణయం
యూపీ ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నిబంధనలు.. యోగి సర్కారు కీలక నిర్ణయం

UP Government Jobs New Rules: యూపీ ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నిబంధనలు.. యోగి సర్కారు కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు ముందు నిర్వహించే క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక చర్యలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించనున్నారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే సంస్థలతో సంబంధం ఉన్న అభ్యర్థులపైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

వివరాలు 

హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉద్యోగం లేనట్లే!

దేశంలో లేదా రాష్ట్రంలో హింసాత్మక మార్గాల ద్వారా అధికార మార్పిడికి ప్రయత్నించే కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ప్రభుత్వ శాఖలు,ప్రభుత్వ కార్పొరేషన్లు,స్థానిక సంస్థల్లో నేరుగా నియామకాలు చేపట్టే ఉద్యోగాలు లభించవు.

అయితే, ఒక వ్యక్తికి ప్రత్యేక రాజకీయ భావజాలం లేదా సిద్ధాంతంపై నమ్మకం ఉన్నంత మాత్రాన అతడిని ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించరు.

హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఎఫ్‌ఐఆర్ నమోదైతే వెంటనే అనర్హత కాదు

అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నంత మాత్రాన అతడిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించరు.

ఈ విషయాన్ని కొత్త మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థిపై ఉన్న ఆరోపణలు, సంబంధిత ఆధారాలను నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

వివరాలు 

ఈ నేరాలకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం

కొన్ని తీవ్రమైన నేరాలు, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి.. -

ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడటం.

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల్లో పాల్గొనడం, సాల్వర్ గ్యాంగ్‌లతో సంబంధాలు కలిగి ఉండటం, ఇతరుల స్థానంలో డమ్మీ అభ్యర్థులను పరీక్షలకు పంపడం.

నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించడం.

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, యూపీఐ (UPI) ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడటం.

ADVERTISEMENT

వివరాలు 

21 ఏళ్ల వయస్సు తర్వాతి మూడేళ్ల కార్యకలాపాలపై దృష్టి

అభ్యర్థికి 21 ఏళ్లు దాటిన తర్వాతి మూడేళ్ల కాలంలో హింసాత్మకంగా అధికార మార్పిడికి ప్రయత్నించినట్లు లేదా సమాజ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే వాటిని పరిశీలనలోకి తీసుకుంటారు.

ఈ అంశాలను క్యారెక్టర్ వెరిఫికేషన్ సమయంలో పరిగణనలోకి తీసుకోనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

30 రోజుల్లో క్యారెక్టర్ వెరిఫికేషన్ నివేదిక

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నివేదికను జిల్లా పోలీసులు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ (LIU) 30 రోజుల్లోగా సమర్పించాలి.

ఈ ప్రక్రియలో ఆలస్యమైతే అభ్యర్థి ఇచ్చిన స్వీయ ప్రకటన ఆధారంగా తాత్కాలిక నియామక పత్రాన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.

అయితే, తర్వాత వచ్చే వెరిఫికేషన్ నివేదిక ప్రతికూలంగా ఉంటే ఆ నియామకాన్ని రద్దు చేస్తారు.

అభ్యర్థికి వ్యతిరేకంగా నివేదిక వచ్చిన సందర్భంలో కలెక్టర్లు అతడికి తన వాదనను వినిపించే అవకాశం కల్పించాలి.

ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా హాజరై తన వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

వివరాలు 

హైకోర్టు ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ అపాయింట్‌మెంట్స్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దేవరాజ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాల మాదిరిగా భారత్‌లో అల్లర్లు సృష్టించి అధికార మార్పిడికి కుట్ర జరుగుతోందని యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT