zero alcohol: జీరో ఆల్కహాల్ నిబంధనతో మద్యం తాగని లోకోపైలట్లకు కష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వేలో అమలవుతున్న 'జీరో ఆల్కహాల్' నిబంధన మద్యం తీసుకోని లోకోపైలట్లకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. జీవితంలో ఎప్పుడూ మద్యం తాగని కొందరు లోకోపైలట్లు సైతం ఈ నిబంధన కారణంగా క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నారు. వారి రక్త నమూనాల్లో ప్రతి డెసిలీటర్కు 10 మిల్లీగ్రాములు (10 ఎంజీ/డీఎల్) లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రైళ్లు నడిపే లోకోపైలట్ల రక్తంలో ఆల్కహాల్ స్థాయి పూర్తిగా సున్నా ఉండాలి. అయితే,సున్నా కంటే కొద్దిగా ఎక్కువ ఆల్కహాల్ గుర్తించినప్పుడు సదరు లోకోపైలట్లు రైలు నడపడానికి అర్హులా?కాదా? అనే అంశంపై రైల్వేబోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ సీనియర్ అధికారి పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు.
వివరాలు
సిబ్బంది రక్త నమూనాల్లో ఆల్కహాల్
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ సమీపంలో 2025లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన ఈ అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది.
ఈ ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) నిర్వహించిన విచారణలో, ప్రమాదానికి గురైన రైళ్లను నడిపిన సిబ్బంది రక్త నమూనాల్లో ప్రతి 100 మిల్లీలీటర్లకు 3 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
రైళ్లను నడిపే సిబ్బందికి నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించకపోయినా,వారి రక్త నమూనాల్లో మాత్రం ప్రతి డెసిలీటర్కు 10 మిల్లీగ్రాముల వరకు ఇథనాల్ ఉన్నట్లు తేలింది.
వివరాలు
రక్తంలో కొద్దిమొత్తంలో ఇథనాల్
మద్యం తీసుకోని వ్యక్తుల రక్తంలోనూ కొన్ని పరిస్థితుల్లో ఆల్కహాల్ స్థాయులు కనిపించే అవకాశం ఉందని లోకోపైలట్ల సంఘం చెబుతోంది.
వివిధ కారణాల వల్ల రక్తంలో కొద్దిమొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి కావచ్చని, మద్యం తాగని వారిలో కూడా ప్రతి డెసిలీటర్కు 10 మిల్లీగ్రాముల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ స్థాయులు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రీయ అధ్యయనాలను ప్రస్తావిస్తోంది.
ఈ నేపథ్యంలో పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించాయనే కారణంతోనే లోకోపైలట్లపై చర్యలు తీసుకోవడం సరికాదని సంఘం అభిప్రాయపడుతోంది.
వివరాలు
రైల్వేబోర్డు నిర్ణయం కోసం ఎదురుచూపులు..
ఈ సమస్యను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పరిష్కారం లభించలేదని ఓ సీనియర్ జోనల్ రైల్వే అధికారి తెలిపారు.
ఈ అంశం ఇంకా బోర్డు వద్ద పెండింగ్‌లోనే ఉందని, దీనిపై వీలైనంత త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రైలు ప్రయాణికుల భద్రతను కాపాడటంతో పాటు, మద్యం తీసుకోని లోకోపైలట్లు అనవసరమైన క్రమశిక్షణ చర్యలకు గురికాకుండా ఉండేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.