Heatwave: వేడి గాలులతో అల్లాడిన ప్రజలు..ఒంగోలు,కావలిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపించింది. కొన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు వేసవిని తలపించాయి. రాత్రి 10 గంటలైనా వేడి తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. వేడి గాలులు వీయడంతో బయటకు వెళ్లినవారితో పాటు ఇళ్లలో ఉన్నవారూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా ఒంగోలు, కావలిలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 39 డిగ్రీలు, బాపట్లలో 38.9, తునిలో 38.1, తిరుపతిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పగటి వేడి తీవ్రంగా కనిపించింది.
వివరాలు
ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం
పశ్చిమబెంగాల్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరం, వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగింది.
రానున్న 48 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు చోట్ల వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు వర్షాల అవకాశంతో రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.