CBSE: మొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తేనే.. రెండవ పరీక్ష రాయగలరు: సీబీఎస్‌ఈ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్‌ఈ పది తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో రెండో విడత పరీక్షలకే హాజరవుతామని కొంతమంది విద్యార్థులు చేసిన అభ్యర్థనలను బోర్డు స్పష్టంగా తిరస్కరించింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తొలి విడత పరీక్షలకు హాజరవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తొలి విడతలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు రెండో విడత పరీక్షలు రాయడానికి అనుమతి ఉండదని తెలిపింది. అలాంటి వారిని 'ఎసెన్షియల్ రిపీట్' కేటగిరీలో ఉంచి,వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రమే అవకాశం ఇస్తామని వెల్లడించింది. అలాగే ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో మాత్రమే ఫెయిల్ అయిన విద్యార్థులను 'కంపార్ట్‌మెంట్' కేటగిరీలో ఉంచుతారు. ఈకేటగిరీలో ఉన్నవారు రెండో విడత పరీక్షలు రాయడానికి అర్హులవుతారు.
వివరాలు
ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ పది పరీక్షలు
ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపర్చుకోవాలనుకుంటే, గరిష్టంగా మూడు సబ్జెక్టుల వరకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశాన్ని బోర్డు కల్పించింది. విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో నూతన జాతీయ విద్యా విధానం చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ ఇప్పటికే వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే తొలి విడత పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించగా, మే నెలలో జరిగే రెండో విడత పరీక్షలను ఐచ్ఛికంగా ఉంచారు. రెండు విడతల పరీక్షలు పూర్తి సిలబస్‌తోనే జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ తొలి విడత పది పరీక్షలు రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమై మార్చి 10 వరకు కొనసాగనున్నాయి.