Cm Yogi : నేడు అయోధ్యకి సీఎం యోగి..ప్రధాని మోదీ పర్యటనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ మేరకు టెంపుల్ సిటీకి వెళ్లి సన్నాహాలను సమీక్షించనున్నారు. డిసెంబర్ 30న శనివారం శ్రీరామ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మోదీ అయోధ్య పర్యటనకు ముందు యోగి అయోధ్యలో పర్యటించనున్నారు. జనవరి 22న రామ్ మందిర్ ప్రారంభోత్సవం జరగనుంది.ప్రధాని అయోధ్య రాకను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు,ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పాటు SSB తరఫున భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘా పెంచారు. ఈ ప్రాంతంలో అల్లర్లను, మూకల కదలికలను నిరోధించేందుకు, సరిహద్దు గుండా ప్రజలను అనుమతించే ముందు వారి గుర్తింపులను నిర్ధారించాలని భద్రతా ఏజెన్సీలను కోరామని గోరఖ్‌పూర్‌లోని సశాస్త్ర సీమా బల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు.
గురువారం సీఎం యోగి టూర్ విశేషాలివే :
ఉదయం 11:30 గంటలకు, ఆయన అయోధ్యలోని రామకథా పార్కుకు చేరుకుంటారు. ఉదయం 11:50 గంటలకు, CM యోగి శ్రీరామ జన్మభూమిలో ' దర్శనం ' చేసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి అయోధ్య ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు, సర్క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యనవాథ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మండలాయుక్త కార్యాలయంలోని కమిషనర్ ఆడిటోరియంలో చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం 3:05 గంటలకు, సీఎం యోగి పోలీస్ లైన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుని లక్నోకు బయలుదేరనున్నారు.