Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ 2.0పై ప్రధాని మోదీ లేఖ.. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు!
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రాష్ట్రంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలు నగర ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది. విజయవాడ ఉత్సవ్ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలను తెరుస్తుంది. పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది.
వివరాలు
మూడు వేదికల్లో విజయవాడ ఉత్సవ్ వేడుకలు
విజయవాడ ప్రజలకు, నగర సాంస్కృతిక వారసత్వానికి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విజయవాడ ఉత్సవ్ నిర్వహణతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో మూడు ప్రధాన వేదికలపై విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఈ వేడుకలకు వేదికలుగా నిలవనున్నాయి.
ఆదివారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విజయవాడ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.
వివరాలు
స్థానిక కళాకారులకు ప్రోత్సాహం.. సినీ ప్రముఖుల సందడి
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా ఇప్పటికే నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు కూడా పాల్గొననున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేందుకు ఈ ఉత్సవ్ దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.