PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ
ఈ నెల 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటించనున్నారు. మరణశిక్ష పడిన భారత మాజీ నావికులను ఖతార్ విడుదల చేసిన తరుణంలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీన మోదీ యూఏఈకు వెళ్తారు. 14న ఇస్లామిక్ దేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభిస్తారు. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం తన యూఏఈ పర్యటన ముగించుకుని.. ప్రధాని ఖతార్‌కు బయలుదేరి వెళతారని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. గత 8 నెలల్లో ప్రధాని మోదీ యూఏఈకి వెళ్లడం ఇది మూడోసారి. 13 ఫిబ్రవరి 2024న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ ఖతార్‌లో పర్యటించడం ఇది రెండో సారి. అంతకుముందు 2016 జూన్‌లో ఖతార్‌లో మోదీ తొలిసారి పర్యటించారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన కేసులో భారత ప్రభుత్వం దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది. ఖతార్ ఎమిర్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ సంతోషం వ్యక్తం చేసింది.