వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు
ఈరోజు ఉదయం ఏథేన్స్ నుండి బెంగళూరుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, డైరెక్టుగా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకోవడానికి ISTRAC కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకున్నారు. అయితే ఏథేన్స్ నుండి వస్తున్న ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, గవర్నర్ రావాల్సింది. కానీ ప్రధాని వద్దనడంతో ఊరుకుండిపోయారు. ప్రోటోకాల్ వద్దని చెప్పడానికి గల కారణాన్ని బెంగళూరులోని హాల్ ఎయిర్ పోర్ట్ అవతల మాట్లాడిన ప్రధాని మోదీ, తాను ఏథేన్స్ నుండి డైరెక్టుగా బెంగళూరు వచ్చానని అన్నారు. ఎక్కువ గంటలు విమాన ప్రయాణం చేయడంతో సరిగ్గా ఏ సమయానికి బెంగళూరు చేరుకుంటానో తెలియలేదని అన్నారు.
నరేంద్రమోదీని విమర్శించిన జైరాం రమేష్
ఏ సమయంలో ఎయిర్ పోర్ట్కు చేరుకుంటానో తెలియకపోవడంతో, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తానే సీఎం ను రావొద్దని చెప్పానని తెలియజేసారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కలిసి ఇస్రో సైంటిస్టులను ప్రధాని కంటే ముందుగా అభినందించడం ప్రధానమంత్రికి చిరాకు తెప్పించిందనీ, అందువల్లే కావాలని రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జైరాం రమేష్ అన్నారు. 2008లో చంద్రయాన్-1 విజయం సాధించినపుడు గుజరాత్ ముఖ్యమత్రిగా ఉన్న మోదీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందుగా అహ్మదాబాద్ లోని స్పేస్ సెంటర్ కు వెళ్ళిన విషయం గుర్తులేదా అని విమర్శించారు.