PM Modi: 15 ఏళ్ల భూవివాదం.. మోదీతో భేటీ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. దీనికి తోడు తన భూమి వ్యవహారం వెనుక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తన బాల్య స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సీబీఐ విచారణ కోరారు ఓ వృద్ధుడు. ఈ భేటీ జరిగిన వారం రోజుల్లోనే వివాదం కీలక మలుపు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాల రోజుల్లో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్‌లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఈ సమావేశం జరిగిన వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు.
వివరాలు
నాకు తెలియకుండానే పత్రాలు సృష్టించారు: వోరా
భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు.
గతంలో వోరాపై ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.
మోదీతో చిన్నతనంలో కలిసి చదువుకున్న అస్గర్ అలీ వోరా ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో నివసిస్తున్నారు.
భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని స్పష్టం చేశారు.
అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు.
వివరాలు
15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదని..
అందులో ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్నినరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు పేర్కొన్నారు.
తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా మంజూరు చేశారనే విషయంపై అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా కోరారు.
భూవివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు.
2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైందని,అయితే దర్యాప్తు నివేదిక వెలువడటంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపించారు.
రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించినట్లు వోరా తెలిపారు.
వివరాలు
మోదీతో భేటీ తర్వాత.. సచివాలయంలో కీలక సమావేశం
ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.
సెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధానకార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఇందులో అస్గర్ అలీవోరాతో పాటు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ,టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి ఓ లేఖ సమర్పించారు.
వివాదాస్పద భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు,ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.
వివరాలు
వోరాపై పోలీస్ ఫిర్యాదు కూడా వెనక్కి
ఇదే సమయంలో అస్గర్ అలీ వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్‌కు మరో లేఖ రాశారు.
ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదం పరిష్కారం దిశగా కీలక అడుగు పడినట్లైంది.