Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డ్యాంతోపాటు మరో 7 కీలక పనులు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణ పనులతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలనూ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో అవసరమైన ఏడు ముఖ్యమైన పనులను డ్యాం నిర్మాణంతో పాటే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం కాగా.. మరికొన్ని ప్రారంభించాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ప్రధాన డ్యాంలో గ్యాప్-1, గ్యాప్-2 పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాం ప్రాంతానికి రాకపోకలు, నిర్వహణ, విద్యుత్తు సరఫరా, కార్యాలయాలు, ఇతర అవసరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు.
వివరాలు
కుడి గట్టు నుంచి ప్రధాన డ్యాం వరకు రోడ్డు
పోలవరం నుంచి ప్రాజెక్టు ప్రధాన డ్యాం వరకు కుడి గట్టు వైపు 12 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది.
ఏడు మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మార్గంలో 22 చోట్ల చిన్న వంతెనలు, కాజ్‌వేలు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి అవసరమైన తవ్వకం పనులు కొనసాగుతున్నాయి.
ఎడమ వైపు 21 కిలోమీటర్ల రోడ్డు
ఎడమ వైపు నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుకునేందుకు 21 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు.
ఈ రోడ్డు కూడా ఏడు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మార్గంలో 36 చోట్ల వివిధ కట్టడాలు నిర్మించాల్సి ఉంది.
ప్రస్తుతం రోడ్డు ఏ మార్గంలో నిర్మించాలనే అంశంపై సర్వే పనులు జరుగుతున్నాయి.
వివరాలు
అఖండ గోదావరి ఎడమ గట్టు పటిష్ఠం
ఈ రెండు రోడ్లకు సంబంధించిన పనులను 2027జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రధాన డ్యాం ప్రాంతంలో చేపట్టాల్సిన పనుల్లో అఖండ గోదావరి ఎడమ గట్టు రక్షణ పనులు కూడా ముఖ్యమైనవి.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి విడుదలయ్యే లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ ఛానల్ మీదుగా ప్రవహించి..తిరిగి గోదావరి సహజ ప్రవాహ మార్గంలో కలుస్తుంది.
ఈ సమయంలో ప్రవాహ ఒత్తిడి పురుషోత్తపట్నం వద్ద ఉన్న అఖండ గోదావరి ఎడమ గట్టుపై పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ గట్టును 6.2కిలోమీటర్ల మేర పటిష్ఠం చేయాల్సి ఉంది.
ఇందులో భాగంగా గాబియన్లను నిర్మించనున్నారు. ఈ రక్షణ పనులను 2027జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
రెండు 33 కేవీ సబ్‌స్టేషన్లు
పోలవరం ప్రాజెక్టు నిర్వహణతోపాటు ఇతర విద్యుత్తు అవసరాల కోసం రెండు 33 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించాల్సి ఉంది.
ప్రాజెక్టు కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్తు సరఫరాను అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
రెండు కంట్రోల్ రూంల ఏర్పాటు
పోలవరం ప్రధాన డ్యాం నిర్వహణ కోసం రెండు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. డ్యాం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలను సమన్వయం చేసేందుకు ఇవి కీలకంగా ఉండనున్నాయి.
వివరాలు
కార్యాలయం, అతిథి గృహం, డార్మిటరీ
ప్రధాన డ్యాం ప్రాంతంలో కార్యాలయ భవనంతోపాటు అతిథి గృహం, డార్మిటరీని నిర్మించనున్నారు.
పోలవరం డ్యాం ప్రధాన కార్యాలయాన్ని 14,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
అతిథి గృహాన్ని 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అంతస్తుతో ఏర్పాటు చేయనున్నారు. డార్మిటరీని 8,796 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
గండిపోచమ్మ ఆలయ తరలింపుపై చర్చలు
పోలవరం ఎడమ గట్టును ఆనుకుని గండిపోచమ్మ ఆలయం ఉంది. ప్రాజెక్టులో నీటిని నింపినప్పుడు ఆలయంలోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
దీంతో ఆలయాన్ని అక్కడి నుంచి తరలించే అంశంపై స్థానికులు, భక్తులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.