2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), ఏపీ నీటిపారుదల శాఖలోని సీనియర్ అధికారులతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని గజేంద్ర సింగ్ షెకావత్ అధికారులను ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనులు ఆలస్యమయ్యాయని అధికారులు వివరించారు. అయితే ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేయడానికి జూన్ 2024ని మంత్రి గడువుగా నిర్ణయించారు. జూన్, 2025 నాటికి ప్రాజెక్టును మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పారు.
రూ.17,414 కోట్ల అడ్వాన్స్ గ్రాంట్‌ను కోరిన ఏపీ ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టును 41.5 మీటర్ల స్థాయికి పూర్తి చేసేందుకు రూ.17,414 కోట్ల అడ్వాన్స్ గ్రాంట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పరిగణలోకి తీసుకున్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన షెకావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డయాఫ్రమ్‌వాల్ డిజైన్‌లు సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ అధికారులు మంత్రికి చెప్పగా.. వెంటనే పనులు ప్రారంభించేందుకు డిజైన్లు క్లియర్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు పునరావాసం, పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.