President's Bodyguard: బాణసంచా కాల్చడంపై అభ్యంతరం.. రాష్ట్రపతి బాడీగార్డ్‌పై కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ వేళ పటాకులు కాల్చే విషయంలో తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో రాష్ట్రపతి భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల సౌరభ్ తోమర్ ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లోని ప్రెసిడెంట్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు రెండు రోజుల సెలవుపై తన స్వగ్రామమైన బాగ్‌పత్ జిల్లాలోని గోపాల్‌పూర్ ఖదానాకు వచ్చాడు. దీపావళి రాత్రి సౌరభ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట రోడ్డుపై టపాసులు కాలుస్తున్నాడు.
వివరాలు
నాటు తుపాకీతో సౌరభ్‌పై కాల్పులు
ఈ క్రమంలో పక్కింట్లో నివసించే ధీరజ్, మోనూ బాణసంచా కాల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.
మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ధీరజ్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో సౌరభ్‌పై కాల్పులు జరిపాడు.
దీంతో బుల్లెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే సౌరభ్‌ను బరౌత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
వివరాలు
ధీరజ్, మోనూలపై రమాలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు శస్త్రచికిత్స చేసి అతడి తలలోని బుల్లెట్‌ను తొలగించారు.
ప్రస్తుతం సౌరభ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ధీరజ్, మోనూలపై రమాలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఘటన అనంతరం పరారైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.