మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జులై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. 2024ఎన్నికలకు బదులుగా 2047పై ఫోకస్ పెట్టాలని మోదీ సూచించారు. 2047లో భారత్ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్నట్లు చెప్పారు. ఆ నాటికి అనేక రంగాల్లో భారతదేశ వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో పని చేయాలని మోదీ తన మంత్రి మండలిని కోరారు. భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో రాబోయే 25ఏళ్ల కాలాన్ని 'అమృత్ కాల్'గా ప్రధాని మోదీ అభివర్ణించిన విషయం తెలిసిందే.
తొమ్మిదేళ్లలో ఏం చేశామో ఈ తొమ్మిది నెలల్లో ప్రజలకు చెప్పండి: మోదీ
వచ్చే 25 సంవత్సరాల్లో దేశంలో చాలా మార్పులు వస్తాయని మోదీ వెల్లడించారు. భారతదేశం ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తి కలిగి ఉంటుందని, వివిధ రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆవిర్భావానికి ఈ నేల సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖలు రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి రోడ్ మ్యాప్‌పై ప్రజెంటేషన్ ఇచ్చాయని పీటీఐ వార్తాసంస్థ నివేదించింది. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, ఆ పనుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు వచ్చే తొమ్మిది నెలలను ఉపయోగించుకోవాలని ప్రధాని కోరారు. మంత్రులు తమ మంత్రిత్వ శాఖల 12 ప్రధాన విజయాలు, పథకాలతో క్యాలెండర్ తయారు చేయాలని మోదీ సూచించారు.