LOADING...
PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు

PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ విక్రయాల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రోజుకు సుమారు రూ.550 కోట్ల వరకు నష్టాన్ని భరిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ,ఆ ప్రభావాన్ని నేరుగా దేశీయ వినియోగదారులపై మోపకుండా కేంద్రం నియంత్రణ కొనసాగిస్తోంది. ముఖ్యంగా సాధారణ కుటుంబాలు,ద్విచక్ర వాహనదారులు, రైతులు వంటి రిటైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ధరలను స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే ఈ రాయితీ పారిశ్రామిక అవసరాల కోసం భారీగా ఇంధనం కొనుగోలు చేసే వారికి వర్తించదని స్పష్టం చేసింది.

వివరాలు 

అక్రమాలపై కఠిన చర్యలకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఇంధన ధరల్లో ఉన్న తేడాల కారణంగా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్రం తెలిపింది. పారిశ్రామిక వినియోగదారులు కూడా తక్కువ ధరకు లభిస్తున్న రిటైల్ బంకుల వద్దే ఇంధనం కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రైవేట్ సంస్థల డీజిల్ విక్రయాలు 38శాతం వరకు తగ్గిపోయాయని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ రంగ బంకులపై అదనపు భారం పడుతోందని,కొన్ని ప్రాంతాల్లో స్థానిక కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వస్తువుల చట్టం కింద చర్యలు చేపట్టాలని, ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

వివరాలు 

దేశంలో ఇంధన కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని సూచన

సామాన్యుల కోసం అందిస్తున్న ఇంధనాన్ని పారిశ్రామిక అవసరాలకు మళ్లించవద్దని పరిశ్రమల సంఘాలను కూడా హెచ్చరించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ భరోసా ఇచ్చింది. దేశీయ అవసరాలు పూర్తిగా తీరుతున్నాయని, అదనంగా భారత్ భారీ స్థాయిలో పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నట్లు గుర్తుచేసింది. సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

Advertisement